వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు... | Sakshi
Sakshi News home page

వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...

Published Wed, Dec 27 2023 8:48 AM

Employees Who Owe More Than Their Salary - Sakshi

దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది.

ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు.

ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్‌కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది.

డబ్బు భలే జబ్బు
మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు.

తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు .

ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు.

-సిమ్మాదిరప్పన్న.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement