ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంటారు. అలా ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ తాను ఆ ఉద్యోగం సాధించిన విషయాన్ని తల్లికి చెప్పిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ప్రశంసలు పోందుతోంది.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన గోపాల్ సావంత్ ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబానికి ఆసరాగా తన తల్లి కుడాల్‌నగర్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటుంది. తన తల్లి కష్టాన్ని బాల్యం నుంచి చూసిన గోపాల్ సావంత్ కఠోర దీక్షతో, కృషితో సీఆర్‌పీఎఫ్ జవానుగా ఎంపికయ్యాడు. అయితే ఈ సంతోషకరమైన విషయాన్ని తన తల్లికి చెప్పిన విధానమే పలువురి మన్ననలు పోందుతోంది. గోపాల్ తన తల్లికి ఇంటి వద్ద చెప్పకుండా.. ప్రతిరోజూ ఆమె రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించే
ప్రాంతానికి వెళ్లి చెప్పాడు. ఆ విషయం చెప్పగానే ఆ తల్లి భావోద్వేగానికి లోనై, నీళ్లు నిండిన కళ్లతో కొడుకును గుండెలకు హత్తుకుంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఇప్పటి వరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. తల్లీ, కొడుకుల అనుబంధానికి ఫిదా అయిపోతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


