మిస్టరీ.. ఎలిసా లామ్‌ డెత్‌ స్టోరీ

Elisa Lam Death Mystery - Sakshi

సరైన సాక్ష్యాధారాలు లేని నేరాలన్నీ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. ఆత్మలు, దెయ్యాలు అంటూ హారర్‌ కోణాన్ని తలపిస్తాయి. ఎలిసా లామ్‌ అనే 21 ఏళ్ల అమ్మాయి మరణోదంతం కూడా అలాంటిదే.

అది 2013, ఫిబ్రవరి 19.. లాస్‌ఏంజెలెస్‌ (అమెరికా)లోని సెసిల్‌ అనే హోటల్‌ రిసెప్షన్‌కి.. వరుసగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. చేస్తోంది ఎవరో కాదు.. ఆ హోటల్లో దిగిన గెస్టులే. ‘హోటల్‌ సర్వీస్‌ అంతా బాగానే ఉంది కానీ.. ట్యాప్‌ వాటర్‌ మురికిగా, కాస్త కుళ్లిన వాసనతో వస్తున్నాయి’ ఇదే వారందరి కంప్లైంట్‌. దాంతో హోటల్‌ సిబ్బంది రంగంలోకి  దిగింది. 

14 ఫ్లోర్లు, 700 గెస్ట్‌ రూములతో ఉన్న తొంభై ఏళ్లనాటి సెసిల్‌ హోటల్‌కి దేశవిదేశాల టూరిస్టులు, పెద్దపెద్ద బిజినెస్‌ మేగ్నెట్స్‌ చాలా మంది వస్తూపోతూ ఉంటారు. ఉన్న నాలుగు ట్యాంకుల్నీ ఒక్కోటిగా చెక్‌ చేస్తూ వస్తున్నారు సిబ్బంది. వాటిలో ఒక ట్యాంక్‌ మూత తీయగానే  గుప్పుమంది దుర్గంధం. తొంగి చూస్తే.. అందులో బాగా కుళ్లిన యువతి శవం తేలియాడుతోంది. ఆ దుర్వార్త మీడియాను చేరింది. అప్పటికే ఆ హోటల్‌ మీద యువతి మిస్సింగ్‌ కేసు నమోదు కావడంతో అక్కడికి చేరుకోవడానికి.. పోలీసులకు, మీడియాకి ఎంతో సమయం పట్టలేదు. ట్యాంక్‌లో దొరికన శవం చైనా సంతతికి చెందిన కెనడా దేశస్తురాలిదని గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ అమ్మాయి పేరు ఎలీసా లామ్‌. 

ఎవరీ ఎలిసా?
ఎలిసా లామ్‌.. 1991, ఏప్రిల్‌ 30న కెనడా, బ్రిటిష్‌ కొలంబియాలోని వాంకోవర్‌లో.. డేవిడ్, యెన్నా లామ్‌ దంపతులకు జన్మించింది. ఆమెకు సారా అనే ఒక సోదరి కూడా ఉంది. ఉద్యోగానికి ముందే ప్రపంచాన్ని చుట్టిరావాలనేది ఎలిసా కల. అదే విషయాన్ని తన గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఇంట్లో చెప్పింది. మొదట వాళ్లు ససేమిరా అన్నారు. ‘ప్రతి రోజు కాల్‌ చేస్తుంటాను’ అనే ఒప్పందం మీద ఎలిసా ఒంటరిగానే లాస్‌ ఏంజెలెస్‌ బయలుదేరింది. 2013 జనవరి 26న లాస్‌ఏంజెలెస్‌లోని సెసిల్‌ హోటల్‌లో దిగింది. నాలుగు రోజుల పాటు ప్రతి చిన్న విషయాన్ని ఫోన్‌లో తల్లిదండ్రులతో పంచుకునేది.

అలా జనవరి 31 ఉదయం పూటా చాలాసేపు మాట్లాడింది. ఆ తర్వాతే ఆమె నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. తల్లిదండ్రులు ప్రయత్నించినా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చేది. రోజులు గడుస్తున్నా ఎలిసా నుంచి ఎలాంటి సమాచారం లేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎలిసా అదృశ్యం కేసు నమోదైంది. వెంటనే సెసిల్‌ హోటల్‌ వైపు తిరిగాయి పోలీస్‌ జీప్‌లు, మీడియా ఓబీ వ్యాన్‌లు. విదేశీ యువతి ఎలిసా మాయం అంటూ వార్తా కథనాలు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. సోషల్‌ మీడియాలోనూ ప్రచారం విస్తృతమైంది. అప్పుడే ఓ వీడియో ప్రపంచాన్ని వణికించింది. అది సెసిల్‌ హోటల్‌ లిఫ్ట్‌లోని సీసీ ఫుటేజ్‌.

పోలీసుల దర్యాప్తులో ఫిబ్రవరి 13న బయటపడిన ఆ వీడియో ఎలిసా చివరి క్షణాలను కళ్లకు కట్టింది. ఆ వీడియోలో.. ఎలిసా పరుగున ఎవరో తరుముతున్నట్లు లిఫ్ట్‌లోకి వచ్చింది. బయటికి తొంగి తొంగి చూస్తూ.. మళ్లీ లిఫ్ట్‌ లోపలకు వచ్చేస్తూ.. అక్కడ నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంతో లిఫ్ట్‌లోని అన్ని అంతస్తుల బటన్‌లు నొక్కేసింది. ఎంతసేపటికీ లిఫ్ట్‌ కదలకపోయేసరికి.. చాలా సేపు లిఫ్ట్‌ గోడలకు ఆనుకుని, దాక్కుంది. అదేమిటో చిత్రం.. లిఫ్ట్‌ తలుపుల్ని ఏదో అతీంద్రియ శక్తి ఆపుతున్నట్లుగా వెంటనే మూతపడలేదు.

దాంతో ఎలిసా లిఫ్ట్‌ బయటికి వెళ్లి.. ఎదురుగా ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లుగా స్పందించింది. చేతులు తిప్పుతూ, కంగారుపడుతూ.. ఏదో మాట్లాడుతూ.. కనిపించింది. ఎలిసా లిఫ్ట్‌ నుంచి బయటకి వెళ్లిపోవడంతో కొన్ని క్షణాల్లోనే లిఫ్ట్‌ తలుపులు మూసుకున్నాయి. ఆ తర్వాత ఎలిసాకు ఏమైందో ఎవరికీ తెలియదు. ఆ వీడియో చూసిన చాలా మంది ఆమెను దెయ్యం వెంబడించిందని నమ్మారు. అయితే కొందరు మాత్రం ఆమె మానసిక స్థితి సరిగా లేదని వాదించారు. సరిగ్గా 6 రోజులకు వాటర్‌ ట్యాంక్‌లో ఎలిసా శవమై తేలడంతో.. బాడీ పోస్ట్‌మార్టమ్‌కు వెళ్లింది.

ఎలిసా బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు కొన్ని మందులు వాడుతోందని తేల్చాయి రిపోర్టులు. అయితే చనిపోయిన రోజు ఆమె ఆ మందులను తీసుకోకపోవడం వల్ల, ఆ సమస్య ఎక్కువై, ఎవరో తనని వెంటాడుతున్నట్లు భావించి లిఫ్ట్‌లో దాక్కోడానికి (సీసీ ఫుటేజ్‌లో చూసినట్లు) ప్రయత్నించి ఉంటుందని, ఆ భయంతోనే వాటర్‌ ట్యాంక్‌లో దూకి ఉండొచ్చని, ఈత తెలియక పైకి రాలేక అందులోనే మునిగి చనిపోయి ఉండవచ్చని అంచనా వేశారు నిపుణులు.

అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. హోటల్‌ వాటర్‌ ట్యాంక్‌ని ఎవరు తెరిచినా రిసెప్ష¯Œ లో అలారం మోగుతుంది. మరి ఎలిసా ట్యాంక్‌లో పడినప్పుడు అలా ఎందుకు జరగలేదనే ప్రశ్న తలెత్తింది. ఇదే ప్రశ్న హోటల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పెడ్రో తోవర్‌ను వేసినప్పుడు .. ‘అలారం మోగకుండా డియాక్టివేట్‌ చేసి.. వాటర్‌ ట్యాంక్‌ మూతను తెరవడం మా సిబ్బందికి మాత్రమే సాధ్యం.

మూత తెరవగానే రిసెప్ష¯Œ తో పాటు పైరెండు ఫ్లోర్లలో కూడా అలారం మోగి.. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ప్రతిసారి మూత తెరిచే సిబ్బంది వివరాలు కచ్చితంగా రికార్డ్‌ అవుతాయి’ అని చెప్పాడు. దాంతో రికార్డులు పరిశీలించారు పోలీసులు. ఏ ఆధారం దొరకలేదు. పైగా అంత ఎల్తైన ట్యాంక్‌ ఎక్కాలంటే ఇంకొకరి సాయం లేనిదే సాధ్యం కాదని అక్కడి సిబ్బంది మాట.

హోటల్‌ పక్కనే ఉన్న బుక్‌ స్టోర్‌ యజమాని కాటీ ఆర్పాన్‌.. ‘ఎలిసాని నేను చూశాను. వాళ్లింట్లో వారి కోసం కొన్ని పుస్తకాలు, మ్యూజిక్‌ సీడీలు మా షాప్‌లోనే కొన్నది’ అని తెలిపాడు. కాటీ మాటల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో లేదని స్పష్టమైంది.

ఎలిసా గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హోటల్‌ సెసిల్‌ చరిత్రను తవ్వారు. అప్పుడే తెలిసింది.. ఆ హోటల్‌కు ‘అమెరికన్స్‌ హోటల్‌ డెత్‌’ అనే మరో పేరుందని. 1920లో స్థాపించిన ఈ హోటల్‌ చరిత్రలో హత్యలు, ఆత్మహత్యలు కలుపుకుని మరణాల సంఖ్య పదహారుకు పైమాటేనట. 1927లో పెర్సీ ఆర్మాండ్‌ అనే వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఆ హోటల్‌లో ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉందట. 

1944లో 19 ఏళ్ల బాలింత అప్పుడే పుట్టిన తన బిడ్డను ఈ హోటల్‌ కిటికీలోంచి విíసిరేసిందని అప్పట్లో ప్రతికలు రాశాయి. బ్లాక్‌ డాలియా అనే నటి ఈ హోటల్‌కు వెళ్లి రాగానే హత్యకు గురైంది. ఆ కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. రిచర్డ్‌ రామిరేజ్‌ అనే సీరియల్‌ రేపిస్ట్‌ 1980లో చాలాకాలం ఈ హోటల్లోనే తలదాచుకున్నాడట.

అనంతరం పోలీసులకు భయపడి మారిన్‌ హెల్త్‌  మెడికల్‌ సెంటర్‌ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మ ఈ హోటల్లోనే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఆత్మే ఎలిసాని చంపేసిందనీ అంటారు. ఏదిఏమైనా ఎలిసా ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? హత్యా? ఆత్మహత్యా? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top