
నవాల్నీ భార్య ఆరోపణ
మాస్కో: రష్యా అధినేత పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ మృతివెనుక ముమ్మాటికీ కుట్ర ఉందని ఆయన భార్య యూలియా నవాల్నీ ఆరోపించారు. తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు పరీక్షల్లో తేలిందని బుధవారం చెప్పారు. రెండు ల్యాబ్ రిపోర్టులు ఇదే విషయం నిర్ధారిస్తున్నాయ ని పేర్కొన్నారు. తన భర్త మృతదేహం నుంచి నమూనాలు సేకరించి, విదేశాలకు తరలించినట్లు చెప్పారు. అక్కడే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
2024 ఫిబ్రవరిలో రష్యాలోని ఆర్కిటిక్ పెనాల్ కాలనీ జైలులో అలెక్సీ నవాల్నీ(47) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు అప్పట్లో అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించాయి. పుతిన్ అవినీతిపై అలెక్సీ గళమెత్తారు. పుతిన్‌కు వ్యతిరేకంగా పలు ప్రదర్శనలు నిర్వహించారు. పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని పుతిన్ సర్కార్ ఆయనపై అభియోగాలు మోపింది. 19 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది.