మంచిమాట
మనం ఎంత జ్ఞానాన్ని, సంపదను సంపాదించినా ‘అహంకారం’ అనే గీత మన మనస్సులో ఉన్నంతవరకు ఆధ్యాత్మిక సత్యం లభించదు. ఆ అహంకారాన్ని తుడిచేసుకున్నప్పుడే ఆత్మశాంతి, నిజమైన జ్ఞానం లభిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే సాధకుడికి అత్యంత పెద్ద అడ్డంకి, సూక్ష్మమైన శత్రువు ‘అహంకారం’. సాధారణ వ్యావహారిక భాషలో అహంకారం అంటే పొగరు, గర్వం లేదా గీర అని భావిస్తాం. కానీ ఆధ్యాత్మిక శాస్త్రంలో అహంకారం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు. ‘నేను – నాది’ అనే మిథ్యా భావన.
‘అహం’ అంటే ‘నేను’, ‘కారం’ అంటే ‘చేసేది’ లేదా ‘రూపం’. తాను నిజానికి అనంతమైన, శుద్ధమైన ఆత్మ స్వరూపుడనని మరచిపోయి, ఈ పరిమితమైన శరీరం, మనస్సు, బుద్ధి, హోదా, ధనం, జ్ఞానమే ’నేను’ అని భావించడమే అహంకారం. వెలుగు లేని చోట చీకటి ఆవరించినట్లు, ఆత్మజ్ఞానం లేని చోట అహంకారం రాజ్యమేలుతుంది. ‘నేను ఫలానా కులానికి/మతానికి చెందినవాడిని’, ‘నేను గొప్ప పండితుడిని’., ‘నేను ధనవంతుడిని’ అనుకోవడం అహంకార ప్రాథమిక రూపాలు.
అహంకారి తన అభి్రపాయమే సరైనదనుకుంటాడు. ఇతరుల వద్ద ఉన్న సత్యాన్ని గానీ, గురువు ఇచ్చే జ్ఞానాన్ని గానీ స్వీకరించలేడు. భక్తి మూలసూత్రం ‘శరణాగతి’. అహంకారం ఉన్న చోట శరణాగతి సాధ్యపడదు. కర్మ బంధాలు పెరగడం వల్ల నూతన కర్మలు చుట్టుముడతాయి. అహంకారాన్ని జయించడం ఒక్కరోజులో అయ్యే పని కాదు. దానికి నిరంతర సాధన, ఆత్మపరిశీలన అవసరం.
అహంకారం అనేది ఒక దీపం చుట్టూ గాజు పలక మీద అద్దుకున్న పొగ తాలూకా మసి లాంటిది. మసి తొలగితేనే దీపపు వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, ఆధ్యాత్మిక సాధన ద్వారా ‘నేను’ అనే అహంకారాన్ని కరిగించినప్పుడు, అంతరంగంలో వెలిగే ఆత్మజ్యోతి సాక్షాత్కరిస్తుంది. అహంకారం నశించిన చోటే ఆనందం, శాంతి, ముక్తి లభిస్తాయి.
ఒక గొప్ప వేద పండితుడికి తన జ్ఞానం పట్ల అంతులేని అహంకారం ఉండేది. ‘తన కంటే గొప్ప జ్ఞాని లేడు, భగవంతుని తత్త్వం పూర్తిగా తెలుస’ని భావించేవాడు. ఒకరోజు ఆయన గుడి మెట్ల వద్ద ఒక ముసలి సాధువు ప్రశాంతంగా కూర్చొని ఉండటం చూశాడు. పండితుడికి అతణ్ణి అవమానించాలని ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, ‘నీవు భగవంతుని గురించి అనేక గ్రంథాలు చదివి ఉంటావు కదా! భగవంతుడు అంటే ఏమిటి? ఆయనను ఏ శాస్త్రం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు? నీకు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసా?’ అని ప్రశ్నించాడు. ఆ సాధువు చిరునవ్వు నవ్వి, ఏమీ మాట్లాడకుండా నేలమీద ఒక చిన్న గీత గీశాడు.
సోమయాజికి అర్థం కాలేదు. అప్పుడు ఆ సాధువు మెల్లగా ఇలా అన్నాడు ‘పండితులవారూ! ఆ గీతను చూడండి. అది ‘నేను’ అనే అహంకారం. మీరు ఇప్పటివరకు చదివిన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, సాధించిన గౌరవాలు అన్నీ ఆ గీత చుట్టూ మీరు నిర్మించుకున్న కోట గోడలు. ‘నేను పండితుడిని’, ’నేను గొప్పవాడిని’ అనే అహంకారంతో ఉన్నంతవరకు భగవంతుడిని చూడలేరు. గీత ఉన్నంతవరకు అది మిమ్మల్ని మిగతా ప్రపంచం నుండి వేరు చేస్తుంది’ . అలా చెప్తూ సాధువు తన చేతితో ఆ గీతను తుడిచివేశాడు.
‘ఇప్పుడు చూడండి... గీత పోయింది. నేలంతా ఒకటైపోయింది. అహంకారం తుడుచుకుపోతే తప్ప, విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్మను దర్శించలేరు. జ్ఞానం అనేది అహంకారాన్ని పెంచడానికి కాదు, కరిగించడానికి!‘ అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ ఒక్క మాటతో సోమయాజికి జ్ఞానోదయమైంది. తాను చదివిన చదువు తనలో వినయాన్ని తేలేదని, అహంకారాన్ని మాత్రమే పెంచిందని గ్రహించాడు. వెంటనే ఆ సాధువు పాదాలకు నమస్కరించి, తన అహంకారాన్ని అక్కడే వదిలేసి ముందుకు సాగాడు.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి


