Edinburgh Fringe: 'ఎడిన్‌బరో ఫ్రింజ్‌ ఫెస్టివల్‌'.. ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం!

Edinburgh Fringe is The Biggest Festival in the World - Sakshi

ఇంగ్లండ్‌లో ఏటా ఆగస్టు నెలలో జరిగే ఎడిన్‌బరో ఫ్రింజ్‌ ఫెస్టివల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సంబరం. రకరకాల కళా సాంస్కృతిక ప్రదర్శనలతో ఏకంగా పాతికరోజుల పాటు జరిగే సుదీర్ఘ సంబరం కూడా. ప్రస్తుతం ఆగస్టు 5 నుంచి 29 వరకు ఈ సంబరాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. ఇదివరకు ఎడిన్‌బరో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ జరిగేది. దీనిని 1947 నుంచి ఎడిన్‌బరో ఫ్రింజ్‌ ఫెస్టివల్‌గా మార్చారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, జాతులకు చెందినవారు ఈ సంబరాల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనల వంటివి జరుగుతాయి. వీటితో పాటే వీధుల్లోనూ రకరకాల ప్రదర్శనలు, విచిత్రవేషధారణలు, విన్యాసాలు, సాము గరిడీలు చేస్తూ వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. వేదికలపై 3,548 ప్రదర్శనలతో పాటు, ఆరుబయట వీధుల్లో దాదాపు 55 వేలకు పైగా ప్రదర్శనలు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సంబరాల్లో హాస్య ప్రదర్శనలకే అగ్రతాంబూలం.

హాస్య ప్రదర్శనల్లో విజేతలుగా నిలిచిన వారికి ఏటా ‘ఎడిన్‌బరో కామెడీ అవార్డ్స్‌’తో సత్కరిస్తారు. ‘కరోనా’ కారణంగా 2020లో ఈ సంబరాలను నిర్వహించారు. గత ఏడాది ఆగస్టు 6–30 తేదీల్లో నిర్వహించినా, ‘కరోనా’ తీవ్రత కారణంగా 673 ప్రదర్శనలు మాత్రమే జరిగాయి. ‘కరోనా’ భయం చాలావరకు కనుమరుగవడంతో ఈసారి పూర్తిస్థాయిలో సంబరాలు జరుగుతుండటంతో జనాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. విచిత్రవేషధారులతో, సర్కస్‌ విన్యాసాల ప్రదర్శనలతో ఎడిన్‌బరో వీథులన్నీ కళకళలాడుతున్నాయి. 
చదవండి: ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top