
మైసూరు ప్యాలెస్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అంబా విలాస్ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశస్తులు వైభవం అంబరాన్ని అంటింది. రాజవంశీకుడు, స్థానిక ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ బంగారు, రత్న సింహాసనం పైన 11వసారి ఆసీనులై దర్బార్‌ని నిర్వహించారు. ముత్యాలు పొదిగిన సంప్రదాయ పట్టు వస్త్రాలను ఆయన ధరించారు. గండభేరుండ చిహ్నంతో సహా పలు రకాల బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు. 12:42 గంటల తరువాత శుభ ముమూర్తంలో రాజవంశానికి చెందిన ఖడ్గాన్ని పట్టుకొని సింహాసనాన్ని అధిష్టించారు.
ఈ సందర్భంగా భటులు జయహొ మహారాజా అంటు నినాదాలు చేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి, రాజ మార్తాండ సార్వభౌమ, యదుకుల తిలక, యదువీర ఒడెయార బహుపరాక్ బహుపరాక్ అని గట్టిగా స్వాగత వచనాలు పలికారు.
నవగ్రహ పూజ:
ముందుగా దర్బార్ ప్రాంగణానికి చేరుకున్న యదువీర్ అక్కడే నవగ్రహాలకు పూజలు చేశారు. కొంత సమయం సింహాసనంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి త్రిషిక భర్తకు పాద పూజ చేశారు. ఆపై ఆయన అందరికీ నమస్కరించి ఆనాటి మహారాజుల తరహాలో దర్బార్‌ని నిర్వహించారు.
చాముండికొండ, పరకాల మఠం, నంజనగూడు, మేలుకొటె, శ్రీరంగపట్టణ, శృంగేరిలతో పాటు 23 ఆలయాల నుంచి పురోహితులు తీసుకువచ్చిన పూర్ణ ఫల ప్రసాదాలను స్వీకరించారు. తరువాత పండితులకు చిన్న చిన్న కానుకలను అందజేశారు. అర్ధగంట సేపు దర్బార్ సాగింది. రాజమాత ప్రమోదా దేవి పాల్గొన్నారు.
మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొదటిరోజు సోమవారం నాడిన శక్తిదేవత చాముండేశ్వరి దేవి అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్త కోటికి దర్శనమిచ్చారు. 9 రోజులపాటు అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. వేలాదిగా భక్తులు దర్శించుకుని తరించారు.
ఫలపుష్ప ప్రదర్శన
మైసూరు దసరా ఉత్సవాలలో ఫలపుష్ప ప్రదర్శనను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. కుప్పణ్ణ పార్క్‌లో ఏర్పాటైన ఈ ఫ్లవర్ షో అక్టోబరు 2వ తేదీ వరకు కొనసాగుతుంది. మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫల పుష్ప విన్యాసాలను తిలకించిన సిద్దరామయ్య సంతోషం వ్యక్తంచేశారు. ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ పోరాటం విగ్రహాలను చూసి వివరాలను తెలుసుకున్నారు.
(చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..)