మాస్కులతోనే మనుగడ!

Don't Neglect Wearing Masks To Prevent Covid-19 - Sakshi

మనం ఎలాంటి మాస్క్‌లు ధరిస్తున్నామన్నది లెక్కకాదు. దాన్ని సరిగా ధరిస్తున్నామా లేదా అన్నదే ప్రధానం. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం పనికి రానట్టే... అన్ని చోట్లా ఒకే పద్ధతి కూడా పనిచేయదు. ఎప్పుడూ మూసి ఉండి, గాలి, వెలుతురు అంతగా రాని ప్రదేశంలో మాస్క్‌ ధారణలో కొంత మార్పు అవసరం. అలాగే ఏసీ గదుల్లో ఇంకోలా ధరిస్తే మరింత ప్రయోజనం. కొంతమంది మాస్కు తీసి జేబుల్లో పెట్టుకుని, బయటకు వెళ్తున్నప్పుడూ లేదా నలుగురూ ఉన్న చోట ధరిస్తూ ఉంటారు. ఇలా జేబులో పెట్టుకోవచ్చా? మూడు పొరల మాస్కుతో ఎందుకు ఎక్కువ ప్రయోజనం, మూసిన గదిలో ఎన్‌ 95 అవసరమేమిటి, గుడ్డ మాస్కులను ఎందుకు రోజూ వేణ్ణీళ్లలో ఉతకాలి లాంటి సందేహాలకు సమాధానాలతో పాటు... అసలు మాస్కులూ, వాటి నుంచి గరిష్టప్రయోజనం పొందడమెలాగో తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

మాస్కులూ, అవి ఎలా ధరించాలనే విషయంలో ఇప్పటికీ చాలామందికి అనేక రకాల అనుమానాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఆధారంగా శాస్త్రీయంగా వాటిని ఎలా ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

మాట్లాడినా కరోనా సోకుతుందా...
మాస్కుల ఉపయోగం ఏమిటో, అవి ఎందుకు వాడాలో తెలుసుకునే ముందర... కేవలం ఎదురూబొదురుగా ఉంటూ మాట్లాడినా కూడా కరోనా సోకుతుందా అనే విషయం తెలుసుకుందాం. దగ్గడం, తుమ్మడం వల్లనే కాదు... మనం మాట్లాడేటప్పుడు కూడా నోటి నుంచి తుంపర్లు వెలువడతాయి. వీటివల్లే వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ తుంపర్లను ఏరోసాల్స్‌గా పిలవవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి 5 మైక్రో మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండేవి, రెండోది తక్కువ ఉండేవి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు అవి బరువుగా ఉంటాయి. దాంతో ఆ బరువుకు కింద పడిపోతాయి. అదే సన్నటివైతే చాలా దూరం వెళ్తాయి. పాటలు పాడినా (53%), మాట్లాడినా (41%) , శ్వాసలో (6%) ఇలా ప్రతిసారీ సన్నటి ఏరోసాల్స్‌ వెలువడతాయి. ఆరు అడుగుల దూరముండి... వారు తుమ్మినా, దగ్గినా మనకు కరోనా సోకే అవకాశం తక్కువ. సన్న తుంపర్లు ఎక్కువ దూరం పయనించకుండా నిలువరించడం కోసమే మాస్కు చాలా అవసరం. దాని వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.

మూసి ఉండే ప్రదేశాల్లో... 
గదిలాంటి మూసి ఉండే (క్లోజ్‌డ్‌) ప్రదేశంలో గాలి బయటకు పోయే అవకాశం లేనప్పుడు / లిఫ్టు వంటి చోట్ల రోగి తుమ్మితే..  వెంటిలేషన్‌ లేనందువల్ల ఆ తుమ్ము నుంచి వచ్చే కణాలు అక్కడే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ.  ఇలా తుమ్మాక 1, 2 నిమిషాల తర్వాత లిఫ్టులో ఎవరైనా వెళ్తే, వారు అక్కడి గాలి పీల్చుకున్నప్పుడు వాళ్లకు వ్యాధి సోకవచ్చు. అదే బాగా గాలి, వెలుతురు సోకే గదిలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. ఇలాంటి మూసి ఉడే ప్రదేశాల్లో మాస్క్‌ అవసరం మరింత ఎక్కువ.

అందుబాటులో అనేక మాస్కులు 
ప్రస్తుతం మనకు ఎన్నో రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి.నీలిరంగు సర్జికల్‌ మాస్కులు, వైద్యులు ధరించే ఎన్‌–95 మాస్కులు, గుడ్డతో తయారై కుట్టించిన సాధారణ మాస్కులు. కంపెనీల బ్రాండెడ్‌ మాస్కులు ఇప్పుడు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. కరోనా తొలిదశలో ఒకేసారి అందరూ మాస్కులు వాడటం మొదలుపెట్టగానే... వైద్యరంగంలో ఉపయోగించే మాస్కుల  కొరత ఒకింత తీవ్రమైంది. అయితే ఇప్పుడు అనేక రకాల మాస్కులతో పాటు... ఐదుపొరల మాస్కులంటూ టీవీ వంటి ప్రసార సాధనాల్లో ప్రచారం చేస్తున్న అనేక రకాల మాస్కులు విరివిగా అందుబాటులోకి వచ్చాయి.

రెండేసి మాస్కులు అవసరమా?
ఎన్‌ 95 మాస్కు ధరిస్తే.. సాధారణంగా రెండోది అవసరం లేదు. కానీ సర్జికల్‌ మాస్కు అయితే రెండోది కూడా అవసరం. ఎందుకంటే, అది ధరించినప్పుడు పక్కల నుంచి కొంత గాలి లోపలికి వెళ్తుంది. ఆ గాలిని కూడా నిరోధించడానికి రెండో మాస్కు అవసరం. వస్త్రంతో చేసినదైనా అన్నివైపులా మూసి ఉంటే రెండోదీ అవసరం లేదు. కానీ, కొంత ఖాళీ ఉన్నా, అందులోంచి వైరస్‌ కణాలు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తపడాలి. 

ఏది మంచిది...? ఎలా వాడాలి...?
సాధారణంగా యువత ఎక్కువగా బయటకు వెళ్తుంటారు. అలాంటి సమయాల్లో  తప్పక మాస్కులు ధరించాలి. వారు మూడు పొరల సర్జికల్‌ మాస్కు ధరించినా సరిపోతుంది. మొదట్లో ధర ఎక్కువగా ఉండటం, అవగాహన లేకపోవడంతో పేదవర్గాలకు చెందినవారు మాస్కులపై పెద్దగా దృష్టి పెట్టేవారు కారు. ఇలాంటి వారు వస్త్రంతో తయారై, కుట్టిన మాస్కులు ధరించినా పర్వాలేదు. ఇలా బయట తిరిగే యువతకూ, తరచూ బయటకు వెళ్లివచ్చే మధ్య వయసువారికి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. వాళ్లకు కరోనా సోకినా లక్షణాలు పెద్దగా వ్యక్తంకావు. కాబట్టి వెంటనే తెలియదు. కానీ, వారినుంచి ఇళ్లలో ఉండే పెద్దవారికి త్వరగా సోకుతుంది. అందువల్ల ఇంటి నుంచి కాలు బయటపెడితే నోరు, ముక్కును నాలుగువైపులా పూర్తిగా మూసి ఉంచేలా మాస్కు ధరించాలి. 

వాడకం ఎలా...
వస్త్రాలతో చేసిన మాస్కులను రోజూ వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరేయడం చాలా ముఖ్యం. వ్యాధి ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, లేదా మాట్లాడినా.. వైరస్‌ కణాలు మాస్కు బయటివైపు ఉపరితలం మీద పడతాయి. అందువల్ల దాన్ని వేడినీళ్లలో ఉతికి, ఎండలో ఆరబెడితే చాలావరకు రక్షణ ఉంటుంది. ఎన్‌ 95 అంటే, 95% వరకు రక్షణ కల్పిస్తుంది. చాలామంది ఏదో మొక్కుబడిగా మాస్కు ధరించినప్పటికీ, దాన్ని ఏ గదమ కిందికో లేదా ముక్కు కిందికో ఉండేలా ధరిస్తుంటారు. పేరుకు ధరించినట్లుగా ఉండేలా అమర్చుకుని బయటకు వచ్చేస్తుంటారు. ఏ మాస్కు అయినా దాన్ని ముక్కు కిందకు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.  ఎన్‌ 95 మాస్కు ఎక్కువసేపు వాడితే ఊపిరి పీల్చడం కష్టం అనిపిస్తున్నా లేదా ఒకింత దుర్వాసన వస్తున్నా, దాంతో ఇబ్బందిగా ఉన్నా, ఆ మాస్కు జీవితకాలం అయిపోయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో కొత్తది లేదా ఉతికిన మాస్కు ధరించాలి. 

జేబులో పెట్టుకోవచ్చా?
మాస్కు ముందు భాగాన్ని ఎప్పుడూ చేత్తో ముట్టుకోకూడదు. వైరస్‌ కణాలు మాస్కు ముందుభాగంలోనే ఉంటాయి. కొందరు కొన్నిసార్లు మాస్కు తీసి జేబులో పెట్టుకుంటారు. అది తప్పు. అప్పుడు మాస్కు ముందుభాగాన్ని చేత్తో ముట్టుకోవాల్సి వస్తుంది. ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోరు ముట్టుకుంటే కొవిడ్‌ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఏ మాస్కయినా చెవుల దగ్గర పట్టి తీసి, బయటపెట్టాలి. అలా ఎప్పుడూ చెవుల వద్దే పట్టుకోవాలి. ముందువైపు ముట్టుకున్నట్లు అనుమానం వస్తే వెంటనే చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.  

మన దేశంలో మాస్కు తప్పనిసరి ఎందుకంటే...
మన దేశంలో అన్నివర్గాల ప్రజలకు, అందరికీ ఇంకా టీకాలు పూర్తిగా అందలేదు. ఇంకా చాలామంది టీకాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నవారూ మన సమాజంలో కొంతమంది ఉన్నారు. పైగా మన దేశంలో జనసాంద్రత చాలా ఎక్కువ కావడంతోనూ, అందరూ ఇంకా టీకాలు వేయించుకోకపోడంతో మిగతా రక్షణ చర్యల కంటే మాస్కులు మాత్రమే కరోనా నుంచి మనల్ని రక్షించగలవు. అందుకే మహమ్మారి తీవ్రత తగ్గేవరకూ  మనమందరమూ తప్పనిసరిగా విధిగా మాస్కులను ధరించి తీరాల్సిందే.

 
డాక్టర్‌  సాయి సుధాకర్‌ సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, కార్డియాక్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top