
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందమైన టాయ్ పూడుల్స్ ప్రయాణికులను సాదరంగా ఆహా్వనిస్తున్నాయి. చిరకాల నేస్తాల్లా పలకరిస్తాయి. తాకితే చాలు వచ్చి ఒడిలో వాలిపోతాయి. ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆడుకొనే సున్నితమైన టాయ్స్‌ను తలపించే ఈ శునకరాజాలు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డాగ్ థెరపీలో భాగంగా వినూత్నంగా ఈ శునకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే ప్రవేశ ద్వారాల వద్ద ఈ శునకాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి.
టాయ్ పూడుల్స్ శునకాలకు తర్ఫీదు సాధారణంగా ప్రయాణం అనగానే ఏదో ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ రద్దీని ఛేదించుకొని సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవడమే ఒక సవాల్, ఏదో ఒక విధంగా ఆ సవాల్‌ను అధిగమించి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోవిధమైన ఆందోళన మొదలవుతుంది. భద్రతా తనిఖీలు దాటుకొని లగేజీ బరువు సరిచూసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొనే వరకు టెన్షన్‌గానే ఉంటుంది.
వరుసగా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ వంటి ప్రహసనాలన్నీ ముగించుకొని టెరి్మనల్‌కు చేరుకొనే వరకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆ ఒత్తిడి నుంచి ఊరటనిచ్చేందుకు మానసిక ప్రశాంతత కలిగించేందుకు డాగ్‌థెరపీ దోహదం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం అందుబాటులో ఉంది.
అదే తరహాలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నాలుగు టాయ్ పూడుల్స్ శునకాలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అలాగే వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ‘ఈ టాయ్ పూడుల్స్ ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దలు, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అందరితో కలిసిపోయేవిధంగా శిక్షణనిచ్చారు.’ అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి కొన్ని గంటల పాటు ఇవి తోడుగా ఉంటాయని చెప్పారు.
సెల్ఫీ ప్లీజ్..
ఈ శునకాలను ప్రయాణికులకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. వాటితో ఆటలాడుకోవచ్చు. ఒడిలోకి తీసుకొని నిమురుతూ కాలక్షేపం చేయొచ్చు. సెలీ్ఫలు కూడా తీసుకోవచ్చు. టాయ్ పూడుల్స్ ద్వారా పొందే అనుభూతులు ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయని, డాగ్ థెరపీలో ఇది ఒక భాగమని నిర్వాహకులు తెలిపారు.
వీటితో కాలక్షేపం చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ‘డాగ్ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గురయ్యే కారి్టసాల్ హార్మోన్‌లను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్‌ను పెంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న 4 శునకాలు వారానికి 5 రోజులు అంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.
ఈజీగా జర్నీ..
సాధారణంగా విమానప్రయాణంలో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. విమాన ప్రయాణం పట్ల ఉండే భయం, ఆందోళనలను డాగ్‌థెరపీ ద్వారా అధిగమించవచ్చు.
అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆలస్యంగా నడిచే విమానాల వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ లభిస్తుందో లేదోననే భయం పట్టుకుంటుంది. ఆ సమయంలో ఈ శునకాలు ఒక డైవర్షన్ టెక్నిక్‌లా పని చేస్తాయి.
(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..)