Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా?.. ఎందుకిలా? | Delhi: India First Birth Photographer Urshita Saini Inspirational Journey | Sakshi
Sakshi News home page

Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా? మొదట ఎవరూ అంగీకరించలేదు.. కానీ ఇప్పుడు

Apr 27 2022 10:08 AM | Updated on Apr 27 2022 10:17 AM

Delhi: India First Birth Photographer Urshita Saini Inspirational Journey - Sakshi

ఉర్షిత సైనీ, ఆమె తీసిన ఫొటోలు(PC: Urshita Saini)

Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా? మొదట ఎవరూ అంగీకరించలేదు.. కానీ ఇప్పుడు

Birth Photographer Urshita Saini: కాన్పు సమయంలో ఫొటోలా? పుట్టిన పసిగుడ్డు కళ్లు తెరిచి మిటకరించి చూసిన క్షణాన్ని కెమెరాలో బంధించడం సాధ్యమా? ఆ క్షణంలో తల్లి కంటి నుంచి కారే ఆనందధారకు ఫొటో సాక్ష్యం పలికితే. దేశంలో స్త్రీలు కొత్త ఉపాధులను కనిపెడుతున్నారు.  ఢిల్లీకి చెందిన ఉర్షిత సైనీ తన ఉద్యోగాన్ని  వదిలి ‘బర్త్‌ ఫొటోగ్రఫీ’లో కొత్త పేరు  సంపాదిస్తోంది.  బిడ్డ కేర్‌మనగానే క్లిక్‌మనిపించే  ఉర్షిత పరిచయం. 
 
ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్, వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ ఉన్నట్టుగా బర్త్‌ ఫొటోగ్రాఫర్‌ ఉంటారా? 
‘పాశ్చాత్య దేశాలలో ఇది కామన్‌. మనకు కొత్త’ అంటుంది ఢిల్లీకి చెందిన ఉర్షిత సైని. ‘మమ్మాస్టోరీ’ పేరుతో స్టుడియో పెట్టి మెటర్నిటీ ఫొటోగ్రఫీ, న్యూబోర్న్‌ ఫొటోగ్రఫీతో పాటు బర్త్‌ ఫొటోగ్రఫీ కూడా చేస్తోంది ఉర్షిత. ‘ఇప్పటికి మేము 500 కాన్పులను షూట్‌ చేశాం. అందులో 300 నేను చేశా’ అంటుందామె. 

2017లో మొదలు ఉర్షితకు ఫొటోగ్రఫీ హాబీ. ఎల్‌ఎల్‌బి చదువుతూ ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఏ ఫంక్షన్‌ జరిగినా తనే ఫొటోలు తీసేది. అవి అందరికీ నచ్చేవి. రాను రాను తాను లాయర్‌ కావడం కన్నా ఫొటోగ్రాఫర్‌ కావడమే మేలని అనుకుంది. 2016లో ఒక ఫొటోగ్రఫీ మేగజీన్‌లో చేరింది. ‘నేను చేరాక ఒక సంచికలో గర్భిణీ స్త్రీల ఫొటోషూట్‌ను వేశాం.

ఆ తర్వాత సంచికను బర్త్‌ ఫొటోగ్రఫీ స్పెషల్‌గా తేవాలనుకున్నాం. కాని ఎంత వెతికినా మన దేశంలో బర్త్‌ ఫొటోగ్రఫీ చేస్తున్న వాళ్లు కనిపించలేదు. ‘‘ఎవరో ఎందుకు, నువ్వే ఎందుకు చేయకూడదు?’’ అన్నాడు నా కలీగ్‌. నిజమే, ఎందుకు చేయకూడదు అనుకున్నాను. కాని మన దేశంలో ఆ పని ఎంత కష్టమో తర్వాత తెలిసింది’ అంటుంది ఉర్షిత 

కాన్పు సమయం సెంటిమెంట్లు 
మన దేశంలో కాన్పు సమయంలోకాని, పుట్టిన బిడ్డ విషయంలోకాని ఎన్నో సెంటిమెంట్స్‌ ఉంటాయి. ‘40 రోజుల వరకూ బయట వాళ్లను చూడనివ్వరు... దిష్టి అని. కొందరైతే అప్పుడే పుట్టిన బిడ్డను ఫొటోలు తీయడంలో ఏదైనా కుట్ర ఉందా అని భయపడ్డారు. ఇక హాస్పిటళ్ల వాళ్లయితే లేబర్‌రూమ్‌లోకి రానివ్వం అని కరాఖండీగా చెప్పేశారు

(ఇప్పుడు కాన్పు సమయంలో భర్తను అనుమతిస్తున్నారు. చట్టప్రకారం మరో వైద్య సిబ్బంది కాకుండా మరో పురుషుడు ఉండకూడదు. మహిళా ఫొటోగ్రాఫర్‌ ఉండొచ్చు. అందుకే ఉర్షిత తన టీమ్‌లో మహిళలను తీసుకుంది). చివరకు ఒక తెలిసిన హాస్పిటల్‌ వాళ్లు ఓకే అన్నారు. కాని ఎంత మందిని బర్త్‌ ఫొటోగ్రఫీ చేస్తానన్నా ఒప్పుకోలేదు. చిట్ట చివరకు ఒక భార్యాభర్త అంగీకరించారు. నా చెవులను నేనే నమ్మలేకపోయాను’ అంది ఉర్షిత. 
 
తొలి అనుభవం 
2017లో తొలి బర్త్‌ ఫొటోగ్రఫీ చేసింది ఉర్షిత. లేబర్‌ రూమ్‌లో కెమెరాను పట్టుకుని నిలబడితే ఆమె చేతులు వణికాయి. ‘డాక్టర్లు అంత టెన్షన్‌లో కూడా కూల్‌గా ఉన్నారు. ఒక దశలో వాళ్లు గర్భిణిని లైట్‌గా తీసుకున్నారా అనిపించింది.

బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి వేస్తున్న కేకలు కంగారు పుట్టిస్తుండగా బిడ్డ బయటకు రాగానే ఫ్లాష్‌ ఉందా, యాంగిల్‌ ఏమిటి అనేది చూడకుండా టకటకా ఫొటోలు తీశాను. ఒక జీవి భూమ్మీదకు వచ్చే క్షణాలను ఫొటో తీయడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆ ఫొటోలు చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు’ అంటుంది ఉర్షిత. 
 
స్పెషలిస్ట్‌
ఉర్షిత ఎవరి దగ్గరా ఫొటోగ్రఫీ నేర్చుకోలేదు. కాని యూట్యూబ్‌లో చూసి ఏ కెమెరాను ఎలా వాడాలో తెలుసుకుంది. భావోద్వేగాన్ని సరిగ్గా పట్టుకోవడంలోనే ఆమె ప్రతిభ అంతా ఉంది. గర్భిణీ స్త్రీల ఫొటోలను ఆమె ఎంత బాగా తీస్తుందో న్యూబోర్న్‌ ఫొటోలు కూడా అంతే బాగా తీస్తుంది. అంటే కాన్పు సమయంలో కాకపోయినా ఒక రెండు మూడు వారాల తర్వాత ఫొటోలు తీయించుకుంటారు కొందరు తల్లిదండ్రులు.

వాటిని తీస్తుంది ఉర్షిత. ‘కాని ఈ పని సామాన్యం కాదు. ఒక కాన్పు అయితే మూడురోజుల పాటు వెయిట్‌ చేయించింది. డెలివరీ ఇప్పుడవుతుంది అప్పుడవుతుందని ఎదురు చూడటమే. చాలా ఓపిక కావాలి’ అంటుంది ఉర్షిత. ఒక ఇంటి బర్త్‌ ఫొటోగ్రఫీ చేసిన ఉర్షిత ఆ ఫొటోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ ఇవ్వడానికి వెళ్లినప్పడు ఆ ఇంటి నానమ్మ మురిసి 500 రూపాయలు చేతిలో పెట్టడం తనకు ఎంత ఫీజు వచ్చినా ఎంతో విలువైనదిగా భావిస్తుంది ఉర్షిత. తల్లి గుండెల మీదకు చేరిన పసిగుడ్డు పెదాలపై విరిసీ విరియని చిరునవ్వు కూడా ఆమెకు ఫీజే.

చదవండి: ఆర్కిటెక్చర్‌ వాక్‌.. అడుగు అడుగులో నిర్మాణం
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement