
ఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. భారత్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌కు నూకలు చెల్లాయి. నెటిజన్లను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వనాశనం చేస్తున్న ఈ భూతానికి సమాధి కట్టే దిశగా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్‌ఫాంలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆన్‌లైన్ ప్రమోషన్, నియంత్రణకు ఉద్దేశించిన ‘రెగ్యులేషన్, ప్రమోషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్’బిల్లుకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ గేమ్ యూజర్లు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ముఖ్యంగా యూజర్లకు నగదు ప్రోత్సాహకాలను ఎరగా వేస్తున్న గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం చట్టబద్ధమైన ని యంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక ఆన్‌లైన్ గేమింగ్ నగదు బెట్టింగ్ పరిధిలోకి వస్తుందా, రాదా అన్నది తేల్చే పూర్తి అధికారాలు దానికి కట్టబెట్టనున్నారు.
దేశాన్ని పట్టి పీడిస్తున్న నగదు అక్రమ చెలామణీ (మనీ లాండరింగ్), అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ క్రైమ్ వంటి పలు జాఢ్యాలకు ఈ ఆన్‌లైన్ నగదు బెట్టింగ్‌లు ఊతమిస్తున్నట్టు తేలిన నేపథ్యంలో కఠిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. ఈ బిల్లును ఇవాళ (బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
బిల్లులోని కీలకాంశాలు..
👉రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు, బాధ్యులకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.కోటి దాకా జరిమానా. పదేపదే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది.
👉వాటిని ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు రెండేళ్ల దాకా జైలు, రూ.50 లక్షల దాకా జరిమానా
👉ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై నిషేధం
👉ఇలాంటి వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాంలకు వాణిజ్య ప్రకటనలను కూడా పూర్తిగా నిషేధిస్తారు
👉నమోదు కాని, అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫాంలపై ఉక్కుపాదం మోపుతారు
👉ఇ–స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత ఆన్‌లైన్ గేమ్స్ తదితరాలను ఇతోధికంగా ప్రోత్సహిస్తారు
👉ఇలాంటి గేమ్స్ ఆడేవారిని మాత్రం శిక్షల పరిధి నుంచి తప్పించారు. వారిని బాధితులుగా పరిగణించాలని నిర్ణయించారు