ఆర్కిటెక్చర్‌ వాక్‌.. అడుగు అడుగులో నిర్మాణం | Sakshi
Sakshi News home page

ఆర్కిటెక్చర్‌ వాక్‌.. అడుగు అడుగులో నిర్మాణం

Published Tue, Apr 26 2022 12:33 AM

Architect Gita Balakrishnan walking from Kolkata to Delhi  - Sakshi

నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్‌ గీతా బాలకృష్ణన్‌ ‘నడక’ గురించి తెలుసుకుంటే   ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది.   1700 కిలోమీటర్లు...   కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం   54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ   ఆర్కిటెక్చర్‌ వాక్‌ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె.
 
గీతా బాలకృష్ణన్‌ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్‌లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్‌ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్‌ దారి గురించి మరింత వివరంగా..
 
► ప్రయాణంలో గ్రహించిన విషయాలు..
అనుకున్న ప్లాన్‌ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్‌’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్‌ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్‌’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్‌ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్‌ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను.

నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్‌ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్‌ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్‌ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్‌ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది.  ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్‌ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు.  

► ఈ ‘వాక్‌’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా?
నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్‌ అసోషియేషన్స్‌.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆర్కిటెక్చర్‌ ఈ రెండు కౌన్సిల్స్‌ నేను చేసే వాక్‌లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్‌ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్‌ వల్ల నేను చాలా నేర్చుకున్నాను.  

► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది?  
మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్‌కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు.  

► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి?
మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్‌ బెంగాల్‌ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్‌లోని ఆర్కిటెక్చర్‌ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్‌కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్‌ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్‌ అనిపించింది.   

► వందల కిలోమీటర్ల వాక్‌ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా?
ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్‌గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్‌ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు.

మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్‌లో ఒక సైక్లింగ్‌ యాక్సిడెంట్‌లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్‌ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్‌ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను.

► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు?
గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్‌’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్‌ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్‌ వృత్తి గురించి, బిల్డింగ్‌ డిజైన్‌ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్‌ చేయమని వివరించాను.   

► మీరు రన్నర్‌ అని కూడా విన్నాం. ఈ వాక్‌కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..?
2014లో రన్నింగ్‌ స్టార్ట్‌ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్‌ చేశాను. ఇలా లాంగ్‌ వాక్‌ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్‌లో ఒక రోజు వాక్‌ అండ్‌ రన్, మరో రోజు వాక్‌. మిక్స్‌డ్‌గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్‌ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను.   

► ఆర్కిటెక్ట్‌గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..?
ఈ వాక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్‌ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్‌ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్‌కి ఫెలోషిప్స్‌ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్‌ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను.  

– నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement