లా ల్లోరోనా.. రాత్రి వేళ చూస్తే పగబడుతుంది..!

The Curse Of La Llorona - Sakshi

మిస్టరీ

ప్రేమ.. నమ్మకం.. మోసం.. వేదన.. క్షణికావేశం.. పశ్చాత్తాపం.. ఇంచుమించుగా ఇవే ప్రతి కథకు అంశాలు. అయితే అసంపూర్ణంగా, తీరని ఆవేదనతో ముగిసిన కొన్ని జీవితాలు.. చరిత్రనే వణికించిన కథలుగా మారతాయి. అంతులేని మిస్టరీలుగా మిగిలిపోతాయి. ‘లా ల్లోరోనా’ ఈ పేరు వింటే మెక్సికోలో పిల్లలే కాదు పెద్దలు కూడా భయంతో పరుగుతీస్తారు. ‘లా ల్లోరోనా’ అంటే స్పానిష్‌లో ‘ఏడ్చే మహిళ’ అని అర్థం. ఏళ్ల కిందటి ఓ కన్న తల్లి ఆక్రందనలే ఈ కథకు మూలం. శాంటాఫె నది తీరంలో రాత్రి పూట నేటికీ ఆమె ఏడుపు వినిపిస్తుందనేది స్థానికుల నమ్మకం. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా ఏడుస్తుంది? మెక్సికన్లు.. ఆమె పేరు విన్నా, ఆమె ఏడుపు విన్నా ఎందుకు భయపడుతుంటారు? ఈ వారం మిస్టరీలో చూద్దాం.

కొన్ని శతాబ్దాల క్రితం.. మెక్సికోలో ఓ పేద కుటుంబంలో మారియా అనే ఓ అందగత్తె ఉండేది. పొడవాటి జుట్టు, చక్కటి మోము, ఆకట్టుకునే చిరునవ్వుతో అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె వీధిలో అలా నడిచి వెళ్తుంటే దేవకన్య వెళ్తుందని అంతా పొగిడేవారు. ‘కనీసం రోజుకు ఒక్కసారైనా ఆమెను చూస్తే చాలు’ అన్నట్లు కుర్రాళ్లు ఆమె రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసేవారు. దాంతో మారియా.. పని లేకున్నా ఆ పొగడ్తల కోసమే ఎక్కువ సార్లు వీధుల్లో తిరిగేదట. ఆమె తెల్లటి గౌన్లే ఎక్కువగా ధరించేదట.

ఓ రోజు మారియా అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు గుర్రం మీద వచ్చిన ఓ యువకుడు. పొగడ్తలతో మాటలు కలిపి.. ఆమెను తన ప్రేమలో పడేసుకున్నాడు. అబ్బాయి అందగాడూ ఆస్తిపరుడూ కావడంతో పేదవాళ్లైన మారియా తల్లిదండ్రులు.. ‘తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది’ అని ఎంతగానో సంతోషించారు. అతడితోనే అంగరంగవైభవంగా మారియా పెళ్లి జరిపించారు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అప్పుడే మారియా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. 

రోజూ ఇంటికి రావాల్సిన భర్త.. మూడు నాలుగు రోజులకోసారి రావడం మొదలుపెట్టాడు. ‘ఎందుకు ఈ మార్పు?’ అంటూ ఓ రోజు మారియా భర్తను నిలదీసింది. ‘నువ్వు గతంలో మాదిరిగా లేవు.. వీలైతే పెళ్లికి ముందులా మారు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు భర్త. మారియా గుండె ముక్కలైపోయింది. ‘అందం శాశ్వతం కాదుగా’ అని వాదించింది. ఎన్నో విధాలుగా భర్తని మార్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. పైగా తన భర్తకు అందంగా ఉండే స్త్రీలంటే మోజనీ, కోరుకున్న అమ్మాయిలకు డబ్బును ఎరగా వేసి.. మోజు తీరాక వదిలించుకుంటాడనీ తెలుసుకుంది. దాంతో మరింత కుమిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. భర్త రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి.

భార్యపై ప్రేమ తగ్గినంత సులభంగా.. పిల్లలపై మమకారాన్ని చంపుకోలేకపోయాడు మారియా భర్త. కేవలం పిల్లల కోసమే ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. దాంతో మారియా మరింత రగిలిపోయింది. భర్తపై కోపం పిల్లలకు శాపంగా మారింది. క్రమంగా పిల్లలపై పగ పెంచుకుంది మారియా. వాళ్లను చంపి.. భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే పిల్లల్ని లాక్కెళ్లి సమీపంలోని శాంటాఫె నదిలో ముంచేసింది. అయితే నదిలో కొట్టుకుపోతున్న పిల్లల అరుపులు.. మారియాలోని తల్లిప్రేమను గుర్తు చేశాయి. ‘అమ్మా కాపాడు..’ అనే పసివాళ్ల ఏడుపులు మాతృ హృదయం తల్లడిల్లేలా చేశాయి. వెంటనే పిల్లల్ని కాపాడాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే నీటి ఉధృతి ఎక్కువ కావడటంతో పిల్లలు నదిలో కొట్టుపోయారు. ఎంత వెతికినా కనిపించలేదు.

అప్పటి నుంచి ఆ నది ఒడ్డునే పిల్లల్ని వెతుక్కుంటూ.. ఏడుస్తూ.. అరుస్తూ.. ఉండిపోయింది మారియా. అదే బెంగతో కొన్ని రోజులకు ఆ నది ఒడ్డునే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆత్మగా మారి... ఇప్పటికీ పిల్లల కోసం వెతుకుతూ కనిపిస్తుందనేది మెక్సికో అంతటా వినిపించే కథ. ఇక్కడి దాకా సెంటిమెంట్‌ యాంగిల్‌లోనే నడిచిన ‘లా ల్లోరోనా’కు.. హారర్‌ ట్విస్ట్‌లను జోడించి కథలు కథలుగా చెబుతుంటారు మెక్సికన్స్‌. తన పిల్లలు తనకు దూరమయ్యారు కాబట్టి మారియా ప్రేతాత్మలా మారిందని, ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా మాయం చేస్తుందని, ఆమెను రాత్రివేళ చూస్తే పగబడుతుందని, ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదనీ ఏళ్లుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికీ చాలా మంది మెక్సికన్లు.. ‘మేము ఆమె ఏడుపుని విన్నాం’ అని చెబుతుంటారు. అక్కడి ప్రజలు రాత్రి వేళ నదులు, సరస్సుల దగ్గరకు వెళ్లాలంటే నేటికీ భయపడతారు. 2019లో, ఆమె ఆచూకీ కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో.. పారానార్మల్‌ ఫైల్స్‌ బృందం ప్రయోగాత్మకంగా కొన్ని వీడియోలు చేసింది. అందులో ఘోస్ట్‌ ఫైండర్‌ సాయంతో.. ఆమె స్వరాన్ని గుర్తించామంటూ కొన్ని భీకరమైన అరుపుల్ని వినిపించారు. ఇదే కోణంలో చాలా హారర్‌ మూవీస్‌ వచ్చినప్పటికీ.. 2019లో వచ్చిన ‘ది కర్స్‌ ఆఫ్‌ లా ల్లోరోనా’ అనే సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో వణికించింది. ఇప్పటికీ మెక్సికోలో కొందరు చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి.. నది సమీపంలో నివాసం ఉండే సాహసం చేయరు. మొత్తానికి ‘లా ల్లోరోనా’ కథ మెక్సికో చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top