Telangana: ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం | Cloud Kitchen Trend in nalgonda | Sakshi
Sakshi News home page

Telangana: ఆన్‌లైన్‌లో.. ఇంటి ఆహారం

Jul 6 2025 12:01 PM | Updated on Jul 6 2025 12:02 PM

Cloud Kitchen Trend in nalgonda

చిన్న పట్టణాలకు విస్తరించిన క్లౌడ్‌ కిచెన్‌ ట్రెండ్‌

ఇంట్లో వంటచేసి స్విగ్గీ, జొమాటో ద్వారా సప్లయ్‌ 

వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలతోపాటు అల్పాహారం

 క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటుకు మహిళల ఆసక్తి

ఆకలైతే వంట చేసుకుని తినే రోజుల నుంచి ఆర్డర్‌ పెట్టెయ్‌ అనే కాలం వచ్చింది. మనకు కావాలి్సన ఆహారాన్ని, నచ్చిన హోటల్, రెస్టారెంట్‌ నుంచి ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే కొద్ది సమయంలోనే మన చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే ఫుడ్‌ డెలివరీ యాప్‌కు అనుసంధానంగా ఉండగా.. ఇప్పుడు కొత్తగా క్లౌడ్‌ కిచెన్‌ అందుబాటులోకి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడలో పలువురు ఇంట్లో వంట చేస్తూ ఆన్‌లైన్‌ ద్వారా సప్లయ్‌ చేస్తున్నారు. ఇందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడంతో క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.        

రామగిరి(నల్లగొండ): ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో క్లౌడ్‌ కిచెన్‌ కాన్సెప్ట్‌ ప్రజాదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో క్లౌడ్‌ కిచెన్‌ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.  ఇంట్లోని వంటగదిని క్లౌడ్‌ కిచెన్‌గా మార్చుకోవచ్చు. రెస్టారెంట్‌లా అధిక ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్‌తో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే సెట్‌ చేసుకోవచ్చు.

తక్కువ పెట్టుబడితో ఏర్పాటు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే క్లౌడ్‌ కిచెన్‌ ప్రస్తుతం మన నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడకు కూడా విస్తరించింది. ఆన్‌లైన్‌ ఫుడ్‌కు అధిక ప్రాచుర్యం ఉండడంతో నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీకి చెందిన జ్యోతి ఇంట్లోని వంట గదిని ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌కు అనుకూలంగా మలుచుకుంది. ‘నాటు.. యమ ఘాటు’ పేరుతో జొమాటో, స్విగ్గీ ద్వారా తన ఫుడ్‌ను ఆన్‌లైన్‌ ద్వారా సప్లయ్‌ చేస్తున్నారు. ఈమెతోపాటు నల్లగొండలో పలువురు మహిళలు క్లౌడ్‌ కిచెన్‌ ఏర్పాటు చేశారు. ఇంట్లో చేసిన వంట కావడంతో చాలా మంది క్లౌడ్‌ కిచెన్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు.

స్కిల్స్‌తో వ్యాపారం చేయవచ్చు 
వ్యాపారం చేయాలంటే విభిన్న ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టుగా స్కిల్స్‌ ఉండాలి. అప్పుడే అందులో రాణించగలుగుతాం. ప్రస్తుతం మార్కెట్‌లో క్లౌడ్‌ కిచెన్‌కు మంచి స్పందన వస్తోంది. వంటలో ప్రావీణ్యం ఉండి సొంతంగా బిజినెస్‌ చేయాలనుకునే వారికి క్లౌడ్‌ కిచెన్‌ సదవకాశం. మూడు నెలల క్రితం నేను క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించాను. ప్రస్తుతం రోజుకు 10 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి లొకేషన్‌తో సంబంధం లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉంటే మంచిది. జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్‌ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఫుడ్, కిరాణా డెలివరీతో పాటు క్లౌడ్‌ కిచెన్‌ వ్యాపారం కూడా పుంజుకుంటోంది. 
– బి.జ్యోతి, క్లౌడ్‌ కిచెన్‌ నిర్వాహకురాలు, నల్లగొండ

ఆన్‌లైన్‌ డెలివరీలు మాత్రమే..
సాధారణంగా రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలంటే.. వంట బాగా వచ్చిన వారిని పెట్టుకోవాలి. అది బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా వరకు హోటల్‌ బిజినెస్‌ చేయాలనుకునే వారు వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే క్లౌడ్‌ కిచెన్‌లు. క్లౌడ్‌ కిచెన్‌ ద్వారా కేవలం ఆన్‌లైన్‌ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లకైతే పెద్ద భవనం అవసరం లేదు. ఖరీదైన ఫర్నిచర్, వెయిటర్లు.. ఇలాంటి ఖర్చులేవీ ఉండవు. ప్రస్తుతం హైదరాబాద్‌ లాంటి పెద్దపెద్ద నగరాల్లో క్లౌడ్‌ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. క్లౌడ్‌ కిచెన్‌లో బిర్యానీ దగ్గర్నుంచి కూరలు, టిఫిన్లు, స్వీట్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు ఆన్‌లైన్‌ ద్వారా లభిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement