పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!

Childrens Story Strategy For Business - Sakshi

అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు.

తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది.

మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి.

‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ  ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి  ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే  ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి.

‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి.
పైడి మర్రి రామకృష్ణ

(చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!)
   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top