టేస్టీగా..కూల్‌..కూల్‌గా, ఐస్‌ క్రీమ్స్‌ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!

Check these Tips For HomemadeTasty Ice Cream - Sakshi

శీతాకాలం సెలవు తీసుకుంటోంది

అపుడే వేసవి  వేడి..మొదలైంది

ఇక పిల్లల ఐస్‌ క్రీమ్‌ల మారాము కూడా మొదలవుతుంది

ఇంకా మార్చి నెల రాకముందే ఎండ సుర్రుమంటోంది. దీనికి తోడు పిల్లలకు గుర్తు రాకపోయినా సరే... మనింట్లో ఇడియట్స్‌బాక్స్‌ అదేనండీ.. టీవీ, రకరకాల ఐస్‌  క్రీమ్‌ల యాడ్స్‌తో ఊరిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఊరుకుంటారా? అందుకే   పిల్లలను  పార్లర్‌కు పరుగు పెట్ట నివ్వకుండా.. ఇంట్లోనే కూల్‌ కూల్‌గా.. టేస్టీగా   ఈజీగా ఐస్‌ క్రీమ్స్‌ తయారు చేసేద్దాం..! 

ఇంట్లోనే హెల్దీగా ఇలా ట్రై చేయండి
ఆరెంజ్‌ ఐస్‌ క్రీమ్‌
కావలసినవి:  చల్లటి పాలు – అర లీటరు (ఫుల్‌ క్రీమ్‌ టిన్‌డ్‌ మిల్క్‌); చక్కెర – 100 గ్రాములు; కార్న్‌ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూన్‌; ట్యాంగ్‌ పౌడర్‌ – 3 టేబుల్‌ స్పూన్‌లు (ఆరెంజ్‌ ఫ్లేవర్‌); మీగడ – వంద గ్రాములు; ఆరెంజ్‌ ఎసెన్స్‌ – నాలుగు చుక్కలు.

తయారీ: అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్‌ వేసి ఉండలు లేకుండా బీటర్‌ లేదా ఫోర్క్‌తో బాగా కలపాలి. మరో పాత్రలో మిగిలిన పాలను పోసి చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్‌ కలిపిన పాలను వేసి కలుపుతూ మీడియం మంట మీద మరో ఐదు నిమిషాల సేపు మరిగించి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత అందులో ట్యాంగ్‌ పౌడర్, క్రీమ్‌ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. మృదువుగా తయారైన మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్‌ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి.

ఆరు గంటల తర్వాత తీసి మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్‌ చేసి తిరిగి అదే పాత్రలో పోసి మళ్లీ అల్యూమినియం ఫాయిల్‌తో కవర్‌ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల సేపు ఉంచితే ఐస్‌క్రీమ్‌ గట్టిగా సెట్‌ అయి ఉంటుంది. ఇప్పుడు కప్పులో వేసి సర్వ్‌ చేయాలి. 

చాక్‌లెట్‌ చిప్‌ ఐస్‌ క్రీమ్‌
కావలసినవి: మీగడ 2 కప్పులు; పాలు 3 టేబుల్‌ స్పూన్‌లు;  కోకో పౌడర్‌-3 టేబుల్‌ స్పూన్‌లు; కండెన్స్‌డ్‌ మిల్క్‌- అర కప్పు; చాకొలెట్‌ చిప్స్‌ -కప్పు; బ్రౌన్‌ షుగర్‌-కప్పులో మూడవ వంతు (బ్లీచ్‌ చేయని చక్కెర, అది లేకపోతే మామూలు చక్కెర తీసుకోవచ్చు) 

తయారీ: ∙మీగడను పన్నెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙వెడల్పుగా ఉన్నపాత్రలో పాలు  పోసి చిన్న మంట మీద వేడి చేయాలి. పాలు మరగాల్సిన అవసరం లేదు, వేడయితే చాలు (పాశ్చరైజేషన్‌ జరగని పాలయితే మరిగించి వేడి తగ్గే వరకు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి). అందులో కోకో పౌడర్‌ వేసి బీటర్‌తో కలపాలి. ఆ తర్వాత కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మొత్తం కలిసే వరకు బీటర్‌తో చిలకాలి. ఇప్పుడు చక్కెర వేసి చిన్న మంట మీద వేడి చేస్తూ కరిగే వరకు చిలకాలి. చక్కెర కరిగిన తర్వాత దించేసి చల్లారే వరకు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి.

ఫ్రిజ్‌లో ఉన్న మీగడను బయటకు తీసి సమంగా కలిసే వరకు చిలకాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకుని పక్కన ఉంచిన కోకో మిశ్రమాన్ని మీగడలో వేసి చిలికినట్లు కాకుండా నిదానంగా కలపాలి.

ఇప్పుడు చాకొలెట్‌ చిప్స్‌ వేసి ఒకసారి కలిపి (చాకొలెట్‌ చిప్స్‌ అన్నీ ఐస్‌క్రీమ్‌లో ఒకచోట చేరకుండా అక్కడొకటి అక్కడొకటి వచ్చేటట్లు కలిపితే చాలు) మిశ్రమం మొత్తాన్ని ఒక ట్రేలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్‌ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల తర్వాత ట్రేని బయటకు తీసి ఐదారు నిమిషాల తర్వాత అల్యూమినియం ఫాయిల్‌ తొలగించి ఐస్‌క్రీమ్‌ని కప్పుల్లో వేసి సర్వ్‌ చేయాలి.

వెనీలా ఐస్‌ క్రీమ్‌
కావలసినవి:  కండెన్స్‌డ్‌ మిల్క్‌ -400 గ్రా; చిక్కటి మీగడ – 200 గ్రా;  వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - 2 టీ స్పూన్‌లు.
తయారీ: ఐస్‌క్రీమ్‌ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి మీగడను ఫ్రీజర్‌లో పెట్టాలి. అలాగే ఒక ఖాళీ పాత్రను కూడా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కనీసం పది లేదా పన్నెండు గంటలసేపు ఉంచాలి. ∙ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరవాత మీగడను ఫ్రిజ్‌లో చల్లబరిచిన పాత్రలో వేసి ఏడు లేదా ఎనిమిది నిమిషాల సేపు చిలకాలి. చిలికేటప్పుడు మొదట మెల్లగా చిలుకుతూ క్రమంగా వేగం పెంచాలి.

ఆ తరవాత అందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మెల్లగా చిలకాలి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి సమంగా సర్ది అల్యూమినియం ఫాయిల్‌ పేపర్‌ అమర్చి అంచులకు క్లిప్‌ పెట్టాలి. పేపర్‌ ఐస్‌ క్రీమ్‌ మిశ్రమంలోకి జారి పోకుండా ఈ ఏర్పాటు. ఈ ట్రేని పన్నెండు గంటల సేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత ఐదారు నిమిషాల సేపు కదిలించకూడదు. ఆ తర్వాత ట్రే మీద కవర్‌ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ని తొలగించి ఐస్‌క్రీమ్‌ని పెద్ద స్పూన్‌తో తీసి కప్పుల్లో వేసి సర్వ్‌ చేయాలి. ఈ ఐస్‌ క్రీమ్‌ కోసం స్టవ్‌ వెలిగించే పనే లేదు. కావలసిన వస్తువులన్నీ రెడీమేడ్‌గా దొరికేవే కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా చేసుకోవచ్చు.  

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top