
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ తిని తొమ్మిదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మరణించారు. మిగిలిన తొమ్మిదిమందికి చింతలకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వనస్థలిపురం ఆర్టీసీ కాలనికి చెందిన ఓ కుటుంబం బోనాల పండుగను నిర్వహించింది. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు, అతిథులతో కలిసి చికెన్,బోటీని ఆరగించారు. అనంతరం, మిగిలిన చికెన్,బోటీని ఫ్రిజ్‌లో ఉంచారు. ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్, మటన్ కర్రీని మరుసటి రోజు తిన్నారు. తిన్న కొద్ది సేపటికే కుటుంబ సభ్యులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
అప్రమత్తమైన స్థానికులు, బంధువులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న రజిత(38), జశ్విత(15), గౌరమ్మ(65), లహరి(17), సంతోష్ కుమార్(39), రాధిక(38), బేబీ కృతంగా (7)లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.