
పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis).. ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో కనిపించే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. ఇది చాలా అరుదైనది అయినప్పటికీ.. తల్లి, బిడ్డకు.. ఒక్కోసారి ఇద్దరికీ ప్రమాదకరమైన పరిస్థితిగా మారొచ్చు. దీని బారినపడే ఓ తల్లి తన చంటిబిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఏం ఎరుగనట్లు నిద్రపోయింది.
ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్‌లో అదృష్టం కొద్దీ ఓ చంటిబిడ్డ ఫ్రిడ్జ్ నుంచి ప్రాణాలతో బయటపడింది. స్థానికంగా ఉండే 23 ఏళ్ల యువతి 15 రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం రాత్రి తన బిడ్డను ఫ్రిడ్జ్‌లో ఉంచి పడుకునిపోయింది. కాసేపటికి పిల్లాడి ఏడ్పు వినిపించడంతో అమ్మమ్మ అప్రమత్తమైంది. వెంటనే ఫ్రిడ్జి తెరిచి.. బిడ్డను తీసుకుని ఆస్పత్రికి పరిగెత్తింది. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకలా చేశావ్? అని అడిగితే.. బిడ్డ పడుకోవట్లేదని అలా చేశానని ఆమె అమాయకంగా బదులిచ్చింది!!.
ఏమిటీ పోస్ట్‌పార్టమ్ సైకోసిక్..
సాధారణంగా ప్రసవానంతర మాంద్యం (Postpartum Depression) కంటే ఇది పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) తీవ్రమైంది. లేనివాటిని చూడడం, వినడం(Hallucinations).. మానసిక కల్లోలం అంటే ఉన్నట్లుండి డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, తీవ్రమైన గందరగోళం, అనుమానాలు(పారనోయా), నిద్రలేమి, తనకు తాను హాని చేసుకునే ప్రయత్నం.. చివరకు.. బిడ్డకు హాని కలిగించే ఆలోచనలూ కలగొచ్చు.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా తగ్గడం(హార్మోన్ల మార్పులు), బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా (జన్యు ప్రభావం) శారీరకంగా.. భావోద్వేగంగా అలసిపోవడం, ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లేకపోవడంతో ఈ మానసిక సమస్యకు గురయ్యే చాన్స్ ఉంది. మొదటిసారి తల్లి అవడం, గతంలో ఇలాంటి సమస్యలు ఉండడం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి కూడా ఈ పరిస్థితికి దారి తీసే అవకాశం లేకపోలేదు.
మోరాదాబాద్ ఘటనలో మహిళకు పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ (Postpartum Psychosis) మానసిక సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు తెలిపారు. డాక్టర్ మేఘనా గుప్తా ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఇలాంటి మానసిక సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అవి తీవ్రమైనవి. మహిళలు ప్రసవం తర్వాత భావోద్వేగంగా అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లేకపోతే, ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి అని అంటున్నారామె.
ఇదిలా ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ‘‘చెడు శక్తుల ప్రభావం’’తోనే ఆమె అలా చేసి ఉండొచ్చని భావించి తొలుత సంప్రదాయ పద్ధతులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో.. చివరకు వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం ఆమె కౌన్సెలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
यूपी: 15 दिन का बच्चा रो रहा था तो उसे फ्रिज में रखकर गहरी नींद में सो गई मां, डॉक्टर ने बताई इस हरकत की असली वजह
Read more: https://t.co/0tf6hNhY1F#UPNews #Moradabad #Mother #Baby #Fridge pic.twitter.com/xxsBj2kKoo— India TV (@indiatvnews) September 10, 2025