
భారతదేశపు స్వదేశీ సెమీకండక్టర్ చిప్ రూపకల్పనలో చైతన్య భారతీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. వీఎల్ఎస్ఐ డిజైన్, అధునాతన చిప్ అభివృద్ధిలో సంస్థ నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సీబీఐటీను దేశంలోని సెమీకండక్టర్ మిషన్‌లో భాగస్వామ్య సంస్థగా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన సెమీకాన్ ఇండియా 2025లో సీబీఐటీ, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సెమీకండక్టర్ చిప్‌ను ప్రదర్శించారు.
సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో సీబీఐటీ-ఓయూ రూపొందించిన చిప్‌ను కూడా ప్రదర్శించినట్లు సీబీఐటీ పేర్కొంది. ఇది దేశీయ సెమీకండక్టర్ రూపకల్పనలో ఆత్మనిర్భరత దిశగా సంస్థ చేసిన కృషిని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘హై-రిజల్యూషన్ ఫేజ్ లాక్డ్ లూప్(ఏడీపీఎల్‌ఎల్)’ చిప్‌ను తయారు చేసినట్లు పేర్కొంది. ఇందులో 180 ఎన్‌ఎం సీమోస్ టెక్నాలజీ నోడ్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. దీన్ని మోహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీలో ఉస్మానియా యూనివర్సిటీ సహాయంతో తయారు చేసినట్లు వివరించింది.
ఈ సందర్భంగా సీబీఐటీ అధ్యక్షులు ఎన్.సుభాష్ ఇతర బోర్డు సభ్యులను అభినందిస్తూ..‘ఈ విజయం సీబీఐటీకి గర్వకారణమని, వీఎల్ఎస్ఐ , సెమీకండక్టర్ టెక్నాలజీలో మరింత పురోగతి సాధించేందుకు సంస్థ మరిన్ని పరిశోధనా అవకాశాలు, మద్దతు అందిస్తుంది’ అని హామీ ఇచ్చారు. సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.వి.నరసింహులు మాట్లాడుతూ..‘ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా సంస్థ చేసిన కృషి’ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో డా.మొహమ్మద్ జియౌద్దీన్ జహంగీర్ (చీఫ్-ఇన్వెస్టిగేటర్), డా.డి.కృష్ణరెడ్డి (కో చీఫ్-ఇన్వెస్టిగేటర్), పి.శిరీషా, పి.చరిష్మా (ప్రాజెక్ట్ సిబ్బంది)ఉన్నారు.
ఇదీ చదవండి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టాలి