సంస్కారాలలో ఏది అత్యంత ప్రధానం..? | Sakshi
Sakshi News home page

చెలియలికట్ట దాటకూడదనే...

Published Sat, Nov 7 2020 6:50 AM

Chaganti Koteswara Rao Article On Marriage Importance - Sakshi

మనుష్య జీవనానికి సంబంధించి సనాతన ధర్మం చెప్పిన సంస్కారాలలో అత్యంత ప్రధానమైనది– వివాహం. జన్మించిన ప్రతి వ్యక్తి కూడ తాను గృహస్థాశ్రమంలో ప్రవేశించడం కోసం పొందవలసిన సంస్కారం ఇది. దార్శనికులయిన రుషులు ఒక ప్రత్యేక ప్రయోజనం అపేక్షించి దీనిని వివాహం అని పిలిచారు. వి–అంటే విశిష్టమైన. వాహము–అంటే పొందుట. లోకంలో ఏది విశిష్టంగా ఉన్నదో...అంటే భగవంతుడిని పొందడానికి ఏ ఆశ్రమ ప్రవేశం చేయాలో దాని పేరే వివాహం. (చదవండి: సంస్కారాలను బోధించే కల్పసూత్రాలు)

అప్పటివరకు పురుషుడు బ్రహ్మచారి. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించే క్రతువే వివాహం. మరొక ముఖ్యమైన విషయం. సనాతన ధర్మ సంబంధ వాఙ్మయంలో వివాహం అనే మాటకు పక్కన విడాకులు అన్న మాట ఎక్కడా కనిపించదు. రామాయణాన్నికానీ, భారతాన్ని కానీ, భాగవతాన్ని కానీ పరిశీలించండి. ఎక్కడ కూడా ‘‘నేను నా భార్యకు విడాకులిచ్చాను’’ అని కానీ, ‘‘నేను నా భర్తకు విడాకులు ఇచ్చాను’’అని కానీ కనపడదు. ఒకసారి ఇద్దరూ కలిసి దంపతులుగా ఆ గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తే– ఇక ఆ జీవితంలో ఇద్దరూ కలిసి అలా ఉండడమే. ఒకవేళ భార్య ఏదయినా పొరపాటు చేస్తే, భర్త ఆమెను దాని నుంచి ఉద్ధరించి మరలా తన పక్కన ఆ స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు తప్ప ఈ దోషం చేసినదని చెప్పి విడాకులివ్వడం ఉండదు. ఇదే మనకు రామాయణం బాలకాండలో అహల్య వృత్తాంతం నిరూపిస్తుంది. జీవితాంతం కూడా పురుషుడు, స్త్రీ కలిసి ఉండడం, ధార్మికమైన సంతానాన్ని పొందడం, కామాన్ని ధర్మంతో ముడిపెట్టడం, తద్వారా భగవంతుడిని చేరుకోవడానికి కావలసిన ప్రయత్నం చేయడం అనేది వివాహం.. అనే వ్యవస్థ ద్వారా సాధింపబడుతుంది. (చదవండి: వేదవాఙ్మయం: ధర్మాలు అంటే ఏంటి..?)

ఇందులో మూడు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. మొదటిది ధార్మికమైన సంతానాన్ని పొందడం. పురుషుడు సముద్రం లాటి వాడు. సముద్రం హద్దులు అతిక్రమించకుండా చెలియలికట్ట అనేది ఉంటుంది. అది వేదం యొక్క తాత్పర్యాన్ని ప్రతిపాదిస్తుంది. అలాగే పురుషుడు ఎంత శక్తిమంతుడయినా తాను మాత్రం తన తేజస్సును వేరొక చోట నిక్షేపించడానికి వీలు లేదు. అది కేవలం తన ధర్మపత్నియందు మాత్రమే నిక్షేపించి తనకు ప్రతిబింబమైన సంతానాన్ని పొందుతాడు. అందుకే ‘ఆత్మా వై పుత్రనామాసి’ అన్నారు. పురుషుని ఆత్మయే ఈ లోకంలో పుత్ర రూపంలో తిరుగుతుంటుంది....అంది వేదం. అలా ధార్మికమైన సంతానాన్ని పొందాలి.

జన్మతః ప్రతి వ్యక్తి కూడా మూడు రుణాలతో ఉంటాడు. పితృ రుణం, రుషి రుణం, దేవ రుణం. పితృ రుణం అంటే తనకు తన తండ్రి ఎలా శరీరాన్ని ఇచ్చాడో, జన్మను ఇచ్చాడో అలా తాను కూడా సంతానానికి జన్మనివ్వాలి. అలా చేస్తే పిత రుణంనుంచి విముక్తి పొందుతాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే దేవరుణం నుంచి, రుషులు ఇచ్చిన వాఙ్మయాన్ని చదువుకుంటే రుషి రుణంనుంచి  విముక్తుడవుతాడు. కాబట్టి పితృరుణం నుంచి విముక్తి పొందాలంటే సంతానాన్ని పొందాలి. అదీ ధార్మికంగా పొందాలి. మనిషి వ్యక్తిగత జీవనంతోపాటూ, సామాజిక జీవనం కూడా గాడితప్పకుండా ఒక క్రమ పద్దతిలో నడవడానికి మన పెద్దలు ఎంతో పకడ్బందీగా రూపొందించిన వ్యవస్థ మన వివాహ వ్యవస్థ.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు   

Advertisement

తప్పక చదవండి

Advertisement