కొడుకు సూపర్ స్టార్ కావచ్చు. కూతురు సి.ఇ.ఓ. కావచ్చు. పిల్లలు వరల్డ్ ఛాంపియన్స్ కావచ్చు. కానీ ఆ శిఖరాల కింద ఒక పునాది ఉంటుంది. అది నాన్న. ఆయన కానిస్టేబుల్ అయినా, వ్యవసాయదారు అయినా బిడ్డల కలలకి రెక్కలు కడతాడు. రేపు ‘ఫాదర్స్ డే’ రోజున మన గెలుపుగాథల వెనక ఉన్న చెమట చుక్కల్ని గుర్తు చేసుకుందాం. కొంతమంది సెలబ్రిటీలు చెప్పిన నాన్న కథల్లో మనందరి ఇళ్లలోని నాన్నను చూద్దాం.
– కె
ఏడాది జీతంతో ఫ్లయిట్‌టికెట్
రఘునాథ పిచాయ్ చెన్నైలో ఎలక్ట్రికల్ ఇంజనీర్. అశోక్‌నగర్‌లో రెండు రూముల ఇల్లు వారిది. ఏసీ లేదు, ఫ్రిజ్ లేదు, స్కూటర్ కూడా లేదు. ఫోన్ కనెక్షన్ రావడానికి ఐదేళ్లు వెయిట్ చేశాడు. ఇద్దరు కొడుకులు హాల్లోనే పడుకునేవారు. కొడుకు సుందర్‌కి స్టాన్ ఫర్డ్‌లో ఎం.ఎస్. సీట్ వస్తే అమెరికా ఫ్లైట్ టికెట్ కొనడానికి ఆ తండ్రి వద్ద డబ్బు లేదు. రఘునాథ చివరికి తన ఏడాది జీతం మొత్తం పెట్టి టికెట్ కొన్నాడు. అది సుందర్ జీవితంలో మొదటి ఫ్లైట్. తర్వాత ఆ కొడుకు గూగుల్ సి.ఇ.ఓ. అయ్యాడు. అయినా సరే రఘునాథ సామాన్యంగానే ఉన్నాడు. చెన్నైలోని ఇల్లు 2023లో అమ్మేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గంటల తరబడి లైన్ లో నిలబడ్డాడు. పన్నులు కట్టాడు. ‘తన కొడుకు ఎవరో చెప్పి పని చేయించుకోలేదు’ అని అందరూ చెప్పుకున్నారు. 
‘మా నాన్న నమ్మింది చదువు ఒక్కటే. ‘చదువు ఒక్కటే నిన్ను కాపాడుతుంది’ అనేవాడు. ఈరోజు నేను గూగుల్ నడుపుతున్నాను. కానీ ఆ ఆఫీస్ కంటే ఉన్నతమైనది నాన్న త్యాగం. ఆయన నాకు ఇంటర్నెట్ ఇవ్వలేదు, కానీ ఇంటరెస్ట్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ పవర్ తెలిసిన నాన్న, క్లౌడ్ నడిపే కొడుకుని తయారు చేశాడు.’
– సుందర్ పిచాయ్ గూగుల్ సి.ఇ.ఒ.
60 కిలోమీటర్లు తిరిగిన కోచ్!
పి.వి. రమణ ఇండియన్ వాలీబాల్ టీమ్ ప్లేయర్. ఏషియన్ గేమ్స్‌లో మెడల్ తెచ్చాడు. రైల్వేలో ఉద్యోగం. కూతురు సింధుకి బ్యాడ్మింటన్ పిచ్చి. కాని గోపీచంద్ అకాడమీ ఇంటికి 30 కి.మీ. దూరం. అయితే ఏంటట? నాన్న ఉన్నాడుగా. రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు కూతుర్ని లేపి కార్లో అకాడమీకి తీసుకెళ్లేవాడు. ప్రాక్టీస్ అయ్యాక మళ్లీ 30 కి.మీ. వెనక్కు తెచ్చేవాడు. అలా ఎనిమిదేళ్లు. రోజూ డ్రైవింగ్. ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. బ్యాడ్మింటన్ నేర్చుకుని కూతురితో ఆడి ప్రాక్టీస్ చేయించాడు. ‘నాన్న నా ఫస్ట్ కోచ్. నా కోసం వాలీబాల్ పక్కనపెట్టి బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకున్నాడు. ఫిట్‌గా ఎలా ఉండాలో ఆయనే తర్ఫీదు ఇచ్చాడు. నేను రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచాక నాన్నని చూసి ఏడ్చేశా. అది నా మెడల్ కాదు. నాన్న రోజూ చేసిన 60 కి.మీ. డ్రైవ్‌కి దక్కిన గౌరవం. నేను మ్యాచ్ ఓడిపోతే నాన్న నన్ను తిట్టలేదు. తప్పు ఎక్కడ జరిగింది అని మాత్రమే చర్చించేవాడు. ఆయన నాకు గెలవడం నేర్పలేదు, నేర్చుకోవడం నేర్పాడు.’
– పి.వి. సింధుబ్యాడ్మింటన్ ఛాంపియన్
అవార్డ్ వచ్చినా చదువు అన్నాడు
డి. శ్రీనివాసన్ క్రిమినల్ లాయర్. బ్రిటిష్ కాలంలో స్వతంత్రం కోసం పోరాడిన మనిషి. కోర్టులో కేసులు వాదించేవాడు. ఇంట్లో స్ట్రిక్ట్. కొడుకు కమల్ ఆరేళ్లకే ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాకి నేషనల్ అవార్డ్ తెచ్చుకుంటే అందరూ పొగిడారు. కానీ తండ్రి భయపడ్డాడు. ‘ఇది ఆఖరి సినిమా అయితే బెటర్’ అన్నాడు. చదువు అయిపోయేదాకా సినిమా వద్దన్నాడు. కొడుకు తర్వాత ప్రపంచం మెచ్చిన నటుడు అయ్యాడు.
‘నాన్నకి నేను అవార్డ్ తెచ్చినా భయమే. ‘చదువు ముఖ్యం’ అన్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నా నన్ను స్కూల్‌కి పంపించేశాడు. ఆ క్రమశిక్షణ వల్లే నేను ప్రతీ సినిమాని స్కూల్ ఎగ్జామ్‌లా తీసుకున్నా. నాన్న లాయర్. వాదన గెలవడం నేర్పాడు. కానీ జీవితంలో ఓడిపోకూడదని కూడా చె΄్పాడు. ఆయన వేసిన కళ్లెం వల్లే నేను ఈరోజు దారి తప్పకుండా ఉన్నా. సినిమాల్లో వేషాలు వేశా కానీ జీవితంలో వేషాలు వెయ్యనివ్వలేదు నాన్న.’
– కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడు
ఆపరేటర్ కొడుకు కెప్టెన్ అయ్యాడు
పాన్ సింగ్ ధోని ‘మెకాన్ ’ సంస్థలో పంప్ ఆపరేటర్. మధ్య తరగతి జీవితం. కొడుకు మహికి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం వస్తే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. జీతం వస్తుంది, రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది అనుకున్నాడు. కానీ కొడుకు బ్యాట్ పట్టుకుని ‘క్రికెట్ ఆడతా’ అంటే వణికిపోయాడు. ‘ఉద్యోగం వదిలేయకు, క్రికెట్ రిస్క్’ అని వారించాడు. కాని కొడుకు మాత్రం ఖరగ్‌పూర్ స్టేషన్ లో టికెట్లు చింపుతూ సెంచరీల గురించి కలలు కన్నాడు. తండ్రి భయానికి వైఫల్యం లేని ప్రయాణమే జవాబు అని అనుకున్నాడు.
‘నాన్న నాతో ‘ఉద్యోగం వదలకు’ అన్నాడు. ఆయన భయం నాకు అర్థమైంది. అందుకే క్రికెట్‌లో అడుగు పెడితే వెనక్కు రాకూడదు అనుకున్నాను. నేను కెప్టెన్ అయ్యాక కూడా నాన్న టీవీ ముందు కూర్చోవడం మానేశాడు. ‘టెన్షన్’ అనేవాడు. వరల్డ్ కప్ గెలిచినా ఇంటికి ఫోన్ చేస్తే ‘సరిగా భోం చేశావా’ అని మాత్రమే అడిగాడు. నా సిక్సర్ల కంటే నా ఆరోగ్యం ఆయనకు ఎక్కువ. నాన్న పంప్ ఆపరేటర్. నీళ్లు సమంగా ఎలా ఇవ్వాలో తెలుసు. నేను టీమ్‌ని సమంగా అలాగే తీర్చిదిద్దడం నేర్పాడు.’’
– ఎం.ఎస్. ధోని క్రికెట్ దిగ్గజం
కూలి తండ్రి కూతుర్ని ఛాంపియన్ చేశాడు
మంగ్టే తోన్పా కోమ్ మణిపూర్‌లో ఒక పేద వ్యవసాయ కూలీ. రోజు సంపాదనతోనే ఇల్లు గడిచేది. కూతురు మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్తుంటే మొదట భయపడ్డాడు. దెబ్బలు తగిలితే భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందాడు. కానీ కూతురిలోని పట్టుదల చూసి తన కష్టాన్ని మర్చిపోయాడు. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా, కిట్ కొనడానికి డబ్బుల్లేకపోయినా అప్పులు చేసి మరీ ఆమెను ప్రోత్సహించాడు. కూతురు ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. ఒలింపిక్ మెడల్ తెచ్చింది. ‘నేను పంచ్ కొడితే నాన్న పొలంలో చెమట కార్చాడు. ఆడపిల్ల బాక్సింగ్ ఏంటి అన్న సమాజంతో నా కోసం పోరాడాడు. నా గెలుపు కోసం ఆయన పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. నాన్న నాకు బాక్సింగ్ నేర్పలేదు, బతకడం నేర్పాడు. రింగ్‌లో దెబ్బలు తిన్నా లేచి నిలబడడం ఆయన కష్టాన్ని చూసే నేర్చుకున్నా.’
– మేరీ కోమ్, బాక్సింగ్ ఛాంపియన్
సూపర్ స్టార్ వెనుక సామాన్య కానిస్టేబుల్
రామోజీరావ్ గైక్వాడ్ బెంగళూరు పోలీస్ శాఖలో ఒక సాధారణ కానిస్టేబుల్. ఖాకీ యూనిఫామ్ వేసుకుని, నిబద్ధతతో డ్యూటీ చేస్తూ సాదాసీదా జీతంతోనే నలుగురు పిల్లల ఇంటి బరువును మోశాడు. కొడుకు శివాజీరావ్ (రజనీకాంత్) చదువు పూర్తి కాకుండానే కుటుంబ పరిస్థితుల వల్ల బస్సు కండక్టర్‌గా చేరాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ప్రపంచం మెచ్చిన ’సూపర్ స్టార్’ అయ్యాడు. కోట్ల రూపాయల సంపాదన, కీర్తి తలుపు తట్టినా.. ఆ తండ్రి మాత్రం జీవితాంతం ఎంతో సాదాసీదాగా, ఒక సాధారణ కానిస్టేబుల్‌లానే బతికాడు. కొడుకు స్టార్‌డమ్‌ని చూసి మురిసిపోయాడే తప్ప, ఎప్పుడూ ఆ గ్లామర్ లోకంలోకి అడుగుపెట్టలేదు. ‘నాన్న ఒక నిజాయితీ గల కానిస్టేబుల్. నేను ఈరోజు ప్రపంచం మెచ్చిన నటుడిని కావచ్చు, కానీ నా దృష్టిలో నాన్నే రియల్ హీరో. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక్క సీన్ కూడా యాక్టింగ్ లేదు, అంతా నిజాయితీ. నేను ఎంత ఎదిగినా ఆ కానిస్టేబుల్ కొడుకుననే క్రమశిక్షణే నన్ను దారి తప్పకుండా ఉంచింది. నా మొదటి అభిమాని, నా చివరి గురువు మా నాన్నే.’
– రజనీకాంత్, ఫాల్కే గ్రహీత
ఆయనే ఆదర్శం
మా నాన్న గారితో నాకు అనేక జ్ఞాపకాలున్నాయి కానీ అన్నింటికన్నా ఈ జ్ఞాపకమే ఇప్పుడు తలచుకున్నా ఆయనని మహోన్నతంగా మా ముందు నిలబెడుతుంది. అది 1982–83 మధ్య జరిగిన ఓ అనుకోని సంఘటన. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య ఒక పెద్ద ఉద్యమం, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంలో మా నాన్న సౌందర్యరాజన్ చీఫ్ వార్డెన్ గా ఉండగా, కొంతమంది విద్యార్థులు ఆవేశంలో మా ఇంటిపై దాడి చేశారు. పోలీసులు మా ఇంటికి వచ్చి కేసు నమోదు చేయమంటే నాన్న మాత్రం ‘వద్దు.. వారు కూడా మన పిల్లలే. తెలియక ఒక తప్పు చేశారు. మళ్లీ కేసు పెడితే వాళ్ల భవితవ్యం దెబ్బతింటుంది’ అని సున్నితంగా తిరస్కరించారు. మరుసటి రోజు దాడికి పాల్పడ్డ యువకులు మా ఇంటికి వచ్చి పశ్చాత్తాపంతో ‘మీలాంటి చీఫ్ వార్డెన్ మాకు దొరకడం మా అదృష్టం... కేసు నమోదయ్యుంటే మా భవిష్యత్ దెబ్బతినేది’ అని క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. ఇటీవల ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి మా నాన్నగారిని కలిసి నమస్కరించడానికి వచ్చినప్పుడు, నన్ను పక్కకు పిలిచి ‘అప్పుడు మీ నాన్నగారు మా మీద కేసు పెట్టి ఉంటే నేను ఈరోజు ఉన్నతస్థాయి అధికారిగా మీ ముందు నిలిచి ఉండే వాడిని కాను’... అని కళ్లు తుడుచుకుని వెళుతుంటే మా నాన్నని తలచుకుని మనసులోనే ఆ మహనీయునికి నమస్కరించుకున్నాను.
ఎం.వి. రంగ రాజన్, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు
ఆయన వ్యక్తిత్వమే వారసత్వం
మా నాన్న పీవీశర్మ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పని చేసేవారు. ఆయనకు బతకడం చేతకాదని అందరూ అనేవారు. అంటే వారి అర్థం డబ్బు, ఆస్తులు సంపాదించడం చేతకాదని. కాని వ్యక్తిత్వాన్ని చంపుకుని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే పోగయ్యే సంపదలో సంతృప్తి ఉండదు.. అలా సంపాదించిన వారికి లేని మనఃశాంతి నాకు అంతులేనంత ఉందని అనేవారాయన. తెలుగు సాహిత్యంపై ఆయనకున్న ప్రేమే నాకూ అబ్బింది. ఇంగ్లీష్ లిటరేటర్ అన్నా ఆయనకు అమితమైన అభిమానం. ఆ అక్షరాభిమానం నాకు ఆర్థిక బలాన్నివ్వకపోయినా, నైతిక స్థిరత్వాన్ని, స్థైర్యాన్నిచ్చాయి. అందరికీ పొలాలు, స్ధలాలు వారసత్వంగా వస్తాయి నాకు మాత్రం మా నాన్న వ్యక్తిత్వం వారసత్వంగా వచ్చింది. అదే నన్ను రచయిత్రిగా మలిచింది.
మణి వడ్లమాని రచయిత్రి
తొలిగురువు నాన్నే..!
మా నాన్న కుత్తుం తాతారావు మూడో తరగతి వరకు చదివాడు. అయితేనేం... ఆయనకు అక్షరం మీద మమకారం ఎక్కువ. ఊరికి ఏ ఉత్తరం వచ్చినా ఆయన చేతికే ఇచ్చి చదివించేవారట. ఇంట్లో నలుగురు అన్నదమ్ములం. అమ్మ హేమావతి. నాన్న నిత్య కష్టజీవి. కానీ ఏ కష్టాన్ని మాదాకా రానివ్వలేదు. వ్యవసాయకూలి పనులతోపాటు అన్ని రకాల పనులకు వెళ్లేవాడు. ఎండాకాలం వస్తే సేద్యం తక్కువ. పనులు దొరకవు. అయితే గడ్డితో నేసే పూరిళ్ల నేతలో మా నాన్న చేయి తిరిగిన మనిషి. ఎర్రని ఎండకు పని చేసి సాయంత్రం అయ్యాక మా అమ్మ దగ్గరకొచ్చి ఇదిగో కూలీ డబ్బులంటూ ఇచ్చేవాడు. ఆ డబ్బులతోనే మా అమ్మ సరుకులు కొనేది, సంతలో మాకు బట్టలు కొనేది. మా నాన్న ఎప్పుడూ చిరిగిన బనియన్, లుంగీతోనే కనిపించేవాడు. మాకు సంతలో హవాయి చెప్పులు కొనిచ్చి ఆయన మాత్రం పాత టైరుతో చేయించుకున్న చెప్పులు వేసుకునేవాడు. అలా మా నాన్నని చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన గొప్పగొప్ప వాళ్ల మాటలు గుర్తొస్తాయ్...‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని, మంచి పుస్తకం కొనుక్కో’అని..ఒక్క కందుకూరి మాత్రమే కాదు, మేము ఇంకా బడి మొహం కూడా చూడకముందే శ్రీశ్రీ, గురజాడ, గరిమెళ్ల సత్యనారాయణ లాంటి మహాకవులు రాసిన ఎన్నో పద్యాలను అలవోకగా చదివి, అర్థం చెప్పేవాడు. అందుకే మా నాన్నే మాకు తొలి గురువు. 2001లో నేను ఆర్మీలో చేరాను. నా తర్వాత మా తమ్ముడు కూడా ఆర్మీలో చేరాడు. మరో ఇద్దరు ఉపాధ్యాయులయ్యారు. ఒకరోజు నేను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తీవ్రమైన కడుపునొప్పితో నాన్న గారు చనిపోయారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది. ఆయన లేని లోటును మేమెన్నటికీ భర్తీ చేయలేం ఆయన చూపిన దారిలో నడవడం తప్ప.
కుత్తుం తాతారావు, వినోద్ కుత్తుంమాజీ సైనికోద్యోగి
పీవీశర్మ
నిర్వహణ: శ్రావణ్ జయ


