కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్‌.. పర్యావరణానికి తీవ్ర నష్టం!

California Oil spill Due To Pipeline Leak - Sakshi

కాలిఫోర్నియాలోని హంటింగ్టన్‌ బీచ్ సమీపంలో చమురు బావి నుంచి ముడి చమురు శనివారం ఉదయం పైకి  ప్రవాహంలా తన్నుకు వచ్చింది. దీంతో అక్కడి ఇసుక తిన్నెల్లో మృతి చెందిన పక్షులు, చేపలతో పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. అక్కడి చిత్తడి నేలలు కూడా చమురు పొరతో నిండిపోయాయి. బీచ్‌లన్నీ నిర్మాణుష్యమైపోయాయి. వార్షిక ఎయిర్‌ షోలు కూడా రద్దయ్యాయి. 

దాదాపుగా లక్ష 23 వేల గ్యాలన్లు లేదా 3 వేల బ్యారెల్స్‌ ముడి చమురు పసిఫిక్‌ మహాసముద్రంలో వచ్చిపడింది. బీచ్‌ సమీపంలోని దక్షిణ లాస్‌ ఏంజెల్స్‌ సిటీలో 40 మైళ్ల వరకు దీని ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో గందర గోళ పరిస్థితి నెలకోంది. వాతావరణమంతా పెట్రోల్‌ దుర్గంధంతో నిండిపోయింది.

హంటింగ్టన్ బీచ్ సమీపంలో గల చమురు బావిలో అయిల్ లీకవుతున్న విషయాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. కాగా హంటింగ్టన్ బీచ్‌ మేయర్ కిమ్ కార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సముద్రం పై భాగంలో దాదాపుగా 13 చదరపు మైళ్ళ మేర చమురు పొర వ్యాపించి ఉండవచ్చని మేయర్ తెలిపారు.  ఈ ఉపద్రవం వల్ల పెద్ద సంఖ్యలో సముద్ర జీవరాశి మరణించింది. పర్యావరణం పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని పర్యావరణ వేత్తలు పేర్కోన్నారు. దీనిని పెద్ద పర్యావరణ విపత్తుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ లీక్‌ ఎక్కడ ఎందుకు సంభవించిందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

చదవండి: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top