
కాదేదీ కవితకు, కళకు కూడా అనర్హం. కళ్లు తెరచి చూసేవారికి కనువిందు చేసే చిత్రకళ.. కళ్లకు గంతలు కట్టుకొని చిత్రకారులు సృష్టించింది అని తెలిస్తే వీక్షకులకు అదో వినూత్న అనుభూతి. అలాంటి చిత్రాలకే కాదు.. ఆ చిత్రకళకూ ఇప్పుడు నగరంలో కళాభిమానులు జై కొడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని చిత్రకారులు గీసిన చిత్రాలను చూడటానికి మాత్రమే కాదు తాము సైతం అదే కళను సాధన చేస్తూ ఓ వైపు సృజనాత్మకత పెంచుకుంటూ మరోవైపు మానసిక ప్రశాంతత పొందుతున్నారు.
బ్లైండ్.. ట్రెండ్..
కొన్నేళ్లుగా బాగా ఆదరణకు నోచుకుంటున్న బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ అనేది కళాకారులు కళ్లకు కట్టు కట్టి, తమ భావోద్వేగాలను, ఊహాశక్తిని ఆధారంగా చేసుకుని పెయింటింగ్స్ రూపొందించే ఒక అరుదైన కళా ప్రక్రియ. మన దేశంలో ఈ ఆర్ట్‌కు సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందిన కొందరు ప్రముఖ కళాకారుల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ చంద్ర శర్మ దాదాపు 6 వేల చిత్రాలను కేవలం స్పర్శ ఆధారంగా చిత్రీకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. ఎన్నో సోషల్ వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కోసం తన కళను వినియోగిస్తున్నారు.
మైసూరుకు చెందిన శ్రీనివాస్ బి.బ్లైండ్ ఫోల్డ్ మల్టీటాలెంటెడ్ ఆరి్టస్టుగా పేరు పొందారు. కేవలం చిత్రకళే కాదు, సంగీతం, డాన్స్ వంటి ఇతర కళారూపాల్లో కూడా కళ్లకు కట్టు వేసుకుని ప్రదర్శనలిచ్చారు. దేశవ్యాప్తంగా పలు స్కూల్స్, కళాకేంద్రాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు.
బెంగుళూర్ నివాసి నివేదిత గౌడ టీవీ ప్రోగ్రామ్స్‌లో బ్లైండ్‌ఫోల్డ్ డ్రాయింగ్, స్కెచ్ డెమోస్ ద్వారా గుర్తింపు పొందారు. యువతలో సృజన పెంపొందించేందుకు బ్లైండ్‌ఫోల్డ్ ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. నగరంలో బ్లైండ్‌ఫోల్డ్ ఆర్ట్ నిపుణులుగా జె.వేణుగోపాల్ పేరొందారు. ఆయన కళ్లకు
గంతలతో ‘గణేశ’ ‘ప్రపంచ ఉష్ణోగ్రత’ వంటి చిత్రాలు గీశారు. కొత్త కొత్త కళలను సాధన చేయడం పట్ల నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో క్రేజ్ పెరుగుతోంది.
పలు ఇన్నోవేషన్స్‌కు సిటీ కేంద్రంగా మారుతున్న వేళ, ఈ తరహా వినూత్న ఆర్ట్ ఫార్మాట్లు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దాంతో బ్లైండ్‌ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ ట్రెండ్‌గా మారుతున్నాయి. కళను అనుభవించడంలో కొత్త కోణాలను అన్వేíÙంచే వారికి వీటి వర్క్‌షాప్‌లు ఆసక్తికరంగా మారడంతో పలు ఆర్ట్ స్టూడియోలు, కమ్యూనిటీ సెంటర్లు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వయసులకు అతీతంగా నగరవాసులు వీటిలో పాల్గొంటున్నారు. ఈ బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్, వర్క్‌షాప్స్ కేవలం వినూత్న కళను నేర్చుకోవడానికి మాత్రమే కాదు కాదు, చూస్తూ అనుభవిస్తూ కళను సృష్టించే ఈ కళారీతి మైండ్‌ఫుల్‌నెస్, స్ట్రెస్ రిలీఫ్, ఇన్నర్ కాని్ఫడెన్స్ పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇటీవల నగరంలో ‘బ్లైండ్‌ఫోల్డ్ ఆర్ట్ ఛాలెంజ్’ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొనేవారు కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మల్ని గీయాలి అంతేకాక అది ఏ బొమ్మో కూడా ఊహించాలి. ఎస్‌సిఎమ్ హైదరాబాద్ ఆర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాలెంజ్‌లో బహుళ రౌండ్ల తర్వాత విజేతలను ఎంపిక చేశారు. సాధారణ వ్యక్తుల కన్నా దృష్టి లోపం ఉన్నవారికి. ఇతర ఇంద్రియాల పట్ల అవగాహన వాటి శక్తుల పట్ల ఆలోచన పెంచడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.
స్ఫూర్తిని అందిస్తున్న బ్లైండ్ ఫోల్డ్ విజయాలు..
చిత్రకళ మాత్రమే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ అనేది చాలా కళలకు, సాహసాలకు విస్తరిస్తోంది. నగరంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు సాధిస్తున్న విజయాలు నగరవాసులకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో..
మంగుళూర్‌కి చెందిన మెజిషియిన్ సమర్థ్ షెనాయ్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా 300 కి.మీ. స్కూటర్ రైడ్‌ను కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేశారు.
బీహార్‌లోని దర్భాంగా ప్రాంతవాసి అయిన మోనికా గుప్తా అయోధ్యలో రామమందిర ప్రారంభత్సవంలో కళ్లకు గంతలు కట్టుకుని రంగోలిని గీసి అందర్నీ ఆకట్టుకున్నారు.
ముంబైకి చెందిన అఫాన్ కుట్టి కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి క్రికెటర్ మొహమ్మద్ షమీ చిత్రపటాన్ని సృష్టించాడు.
చెన్నైకి చెందిన శిల్పి చంద్రు స్పర్శ, విజువలైజేషన్ కళ మధ్య సంబంధాన్ని వివరిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని శిల్పాలను సృష్టించే శిల్పకారుడిగా పేరొందారు.
వాయిద్య కారులు, గాయకులు సహా అందరూ కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన ఇచ్చే ముంబైకి చెందిన బ్లైండ్ ఆర్కెస్ట్రా కళాకారులు కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు.
(చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..)