
చక్కని తలకట్టుతోనే ముఖానికి అందం వస్తుంది. జుట్టు ఊడిపోతున్నా, నెత్తి పలచబడిపోతున్నా చాలామంది అసలు సహించలేరు. జుట్టు ఊడిపోయే సమస్యకు ‘ప్లాస్మా థెరపీ’తో మంచిఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ చికిత్సలో ఎవరికి ట్రీట్‌మెంట్ చేస్తున్నారో వారి రక్తమే సేకరించి, ఆ రక్తంలో ప్లేట్‌లెట్లు అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు.
ఆ ప్లాస్మాలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. వాటిని సూక్ష్మంగా ఉండే సూదులతో, తలపైన జుట్టు రాలిన ప్రదేశంలో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కుదుళ్లు పునరుత్తేజం పొంది, కొత్త జుట్టు ఏపుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ట్రీట్‌మెంట్‌కి సాధారణంగా 3 నుంచి 6 వారాల వ్యవధిలో, సుమారు 4 సెషన్లు అవసరమవుతాయి.
చర్మ సంరక్షణ కోసం..
ఆధునిక జీవనశైలిలో, చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టంగా మారుతోంది. అలాంటప్పుడు చర్మాన్ని ఎల్లవేళలా కళకళలాడేలా ఉంచుకోవాలంటే చిత్రంలోని ఈ స్టైలిష్ గాడ్జెట్‌ని వెంట ఉంచుకోవాల్సిందే!ఈ ‘పోర్టబుల్ నానో ఫేషియల్ డివైస్’ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రోజువారీ చర్మ సంరక్షణకు, ఇది కాంపాక్ట్‌గా ఉంటుంది. ఆఫీసులో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ డివైస్‌ను ఉపయోగించి, చర్మానికి తక్షణ తాజాదనాన్ని పొందవచ్చు.
ఈ ఫేషియల్ స్టీమర్ పైభాగంలో ప్రత్యేకమైన మిర్రర్ ఉంటుంది. దాని చుట్టూ ఎల్‌ఈడీ లైట్ కూడా ఉండటంతో చీకటి వేళల్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ మిర్రర్ 180 డిగ్రీలు కదులుతూ ఉండటంతో, నచ్చిన తీరులో పట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ మిర్రర్ ఇరువైపులా ఉండటంతో ఎటు తిప్పినా అందాన్ని చూసుకోవచ్చు.
పైగా ఈ డివైస్ ఆన్‌లో ఉన్నప్పటికీ శబ్దం చేయదు. ఆటో షట్‌డౌన్ ఆప్షన్‌తో చాలా అనుకూలంగా పని చేస్తుంది. దీనిలో టెంపరేచర్ సెట్టింగ్స్ మార్చుకోవడం కూడా తేలికే! దీని ధర సుమారు రూ.2,500 ఉంటుంది. ఈ డివైస్ నుంచి వచ్చే ఆవిరితో చర్మాన్ని లోతుగా శుభ్రపరచుకోవచ్చు. దీనిలో 80 ఎమ్‌ఎల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిని ఈజీగా డివైస్‌కి కింద భాగంలో సొరుగు మాదిరిగా అమర్చుకోవచ్చు. ఇది ఆగకుండా పదిహేను నిమిషాల పాటు ఆవిరి అందిస్తుంది. ఈ స్పెషల్ ఫేస్ స్టీమర్ వెంట ఉంటే అన్ని వేళలా తాజాగా మెరిసిపోవచ్చు.
(చదవండి: ఒత్తిడి కంటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు)