ప్రముఖ బ్యూటీ అప్లయన్స్ బ్రాండ్ ‘షార్క్ బ్యూటీ’ హెయిర్ కేర్ విభాగంలో సరికొత్త పరికరాన్ని ప్రవేశపెట్టింది. జుట్టును వేగంగా, సురక్షితంగా స్ట్రెయిటనింగ్ చేసేలా రూపొందించిన ‘సిల్కీప్రో స్ట్రెయిట్’ను మార్కెట్లోకి విడుదల చేసింది.
సిల్కీప్రో స్ట్రెయిట్ అత్యాధునిక ‘ఎయిర్ పవర్డ్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది వేడికి బదులుగా గాలి ప్రవాహం ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది. దీనివల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పరికరం అందరికీ అనుకూలంగా ఉంటుంది. కర్లీ, కాయిల్డ్, టెక్స్చర్డ్ హెయిర్ ఉన్నవారు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే మృదువైన, పిన్–షార్ప్ స్ట్రెయిటనింగ్ పొందవచ్చు.
దీనికోసం ప్రత్యేకమైన ఇంటర్‌చేంజబుల్ కోంబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ హీట్ సెన్సర్ ఉంటుంది. అంటే ఇది సెకనుకు వెయ్యిసార్లు టెంపరేచర్‌ని పర్యవేక్షిస్తూ, జుట్టుకు నష్టం కలగకుండా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. స్నానం చేసిన వెంటనే తడి జుట్టుపై కూడా దీనిని నేరుగా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును ఆరబెట్టడంతో పాటు స్ట్రెయిటెనింగ్ కూడా చేస్తుంది.
కొద్దిపాటి జాగ్రత్తలతోనే ..
ఖరీదైన క్రీములు మేనిని మెరిపిస్తాయని అనుకుంటుంటారు. కాని, మేని మెరుపు కేవలం మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులతోనే సాధ్యం కాదు. మనం పాటించే జాగ్రత్తలతోనే మేని మెరుపును కాపాడుకోవచ్చు. చాలామంది ఇంటి నుంచి బయలుదేరే ముందు సన్‌స్క్రీన్ రాసుకుని వదిలేస్తారు. చెమట వల్ల అది త్వరగా పోతుంది. అందుకే ప్రతి మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.
చాలామంది గంటల తరబడి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటారు. దీని వల్ల వేడి పెరిగి చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు హెడ్‌సెట్ వాడటం మేలు. తాత్కాలిక మెరుపు కోసం వాడే ఉత్పత్తులు దీర్ఘకాలంలో మీ చర్మానికి హాని చేయవచ్చు. ముఖం పదేపదే కడగడం వల్ల చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతిని, చర్మం త్వరగా కమిలిపోతుంది. అలసట పోవడానికి వేడి నీళ్ల స్నానం హాయిగానే ఉన్నా, అది మీ చర్మంలోని తేమను హరిస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా పొడిబారిపోయి ముడతలు వస్తాయి.
ముఖాన్ని మెరిపించే ముత్యాలు
ముత్యాలు అలంకారానికే కాదు, మేనిని మెరిపించడానికీ ఉపయోగపడతాయని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన చైనా మహారాణి వు జెషియన్ అందం కోసం ముత్యాల పొడిని వాడేది. రసాయనాలతో కాకుండా సహజసిద్ధంగా తయారుచేసే ఈ పొడిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది.
ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఒకప్పుడు కేవలం రాజకుటుంబీకులకే పరిమితమైన ఈ ప్రాచీన పద్ధతి, ప్రస్తుతం ఆధునిక చర్మ సంరక్షణ పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతోంది. నేడు అనేక ప్రముఖ బ్యూటీ బ్రాండ్లు తమ ఉత్పత్తులలో ఈ ముత్యాల పొడిని ఉపయోగిస్తూ, పురాతన చైనా అందాల రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.
(చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్, నో స్ట్రిక్ట్ డైట్)


