
సద్దుల బతుకమ్మకు నైవేద్యాలు
సద్దుల బతుకమ్మ రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటకాలు ప్రాంతాల వారీగా ఉంటాయి. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, పుట్నాలు, బియ్యం.. తో వంటలు చేస్తారు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా సద్దుల బతుకమ్మ నైవేద్యాల తయారీ గురించి తెలుసుకుందాం.
పొడులతో సద్దు
కావల్సినవి : ∙అన్నం – 3 కప్పులు నువ్వులు, వేరుశనగలు, ఎండు కొబ్బరి (వేయించి, ΄÷డులు అర కప్పు చొప్పున) – పొడులకు, కారం, ఉప్పు కలుపుకోవచ్చు.
తయారీ : ఒక్కో కప్పు అన్నానికి ఒక్కో అరకప్పు రకం పొడి కలిపి సద్దులను సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసిన పోపును కలుపుకోవచ్చు.
సజ్జ ముద్దలు / సజ్జ లడ్డూలు
కావల్సినవి: సజ్జల పిండి – 2 కప్పులు; బెల్లం – కప్పు (తురిమినది); సోంపు – 2 టీ స్పూన్లు; నెయ్యి – 2 టీ స్పూన్లు
తయారి: సజ్జ పిండిలో తగినన్ని నీళ్లు కలిపి, ముద్ద చేయాలి. తగినంత ముద్ద తీసుకొని, చపాతీ చేసినట్టుగా రొట్టె చేసి, పెనం మీద వేసి కాల్చాలి. మరీ గట్టిగా కాకుండా రెండువైపులా కాల్చి, ప్లేట్‌లో వేయాలి. వేడిగా ఉండగానే చేత్తో రొట్టెను చిన్న చిన్న ముక్కలు చేసి, (చేత్తో చేయలేని వారు రోట్లో రొట్టె, బెల్లం వేసి దంచవచ్చు) బెల్లం, సోంపు, నెయ్యి వేసి, గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి. ఇలా తయారుచేసిన సజ్జ ముద్దలను అమ్మవారికి న్రైవేద్యంగా పెడతారు.
వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకని చిన్నపిల్లలు, గర్భవతులకు తప్పక పెడతారు. 3–4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో సజ్జ రొట్టెకు బదులుగా గోధుమ రొట్టెతో ముద్దలు కడతారు.
పెరుగన్నం
కావల్సినవి: కప్పు అన్నం, కప్పు పెరుగు, తగినంత ఉప్పు
తయారి: అన్నంలో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. చివరగా బాణలిలో కొద్దిగా నెయ్యి/నూనె వేసి పోపు పెట్టుకోవాలి. అదనంగా జీడిపప్పు
చేర్చుకోవచ్చు.
పరమాన్నం
కావల్సినవి: కప్పు – బియ్యం; మూడు – కప్పుల పాలు; కప్పు– నీళ్లు; కప్పు – బెల్లం; మూడు టీ స్పూన్లు – నెయ్యి;
తయారి: అన్నం ఉడుకుతుండగా దాంట్లో తరిగిన బెల్లం, నెయ్యి వేసి, పాలు పోసి, మరికాసేపు ఉడికించి దించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ పరమాన్నంలో కలపాలి.