
సందర్భం
(7, మంగళవారం ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమనాడు వాల్మీకి జయంతి)
భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం శ్రీమద్రామాయణం. మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాల్లో చెప్పిన అంశాలనే సామాన్య మానవులకు కూడా అర్ధమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకుని వాల్మీకి రామాయణాన్ని వ్రాశాడు. రామాయణాన్ని పరమ పవిత్ర భక్తి వేదంగా పఠిస్తూ పారాయణ చేసేవారు కొందరైతే, మహోత్కృష్ట్ట కావ్యంగా చదువుతూ ఆనందించేవారు కొందరు, మరికొందరు అందులోని కౌశల్యానికి ముగ్ధులైతే, ఇంకొందరు అందులోని మానవీయ విలువలను గ్రహించేవారు.
రామాయణం భారతీయుల ఆత్మ... అయితే, యావత్ మానవజాతికి చుక్కాని వంటిదని చెప్పొచ్చు. నిత్యజీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మానవ జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అణగారిన కులాలలో పుట్టినా విలువలతో.. పవిత్రంగా జీవన పయనం సాగించే వారిని చేయి పట్టుకుని నడిపించక మానడు. అంటే ఆ దైవానికి మన గుణగణాలు ప్రధానం కాని కుల మతాలు ప్రమాణం కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి.
రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మనవాళికి మార్గదర్శనం చేసే సుభాషితాలెన్నో చెప్పాడు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మమాలను ధర్మసూత్రాలను తాను విరచించిన రామాయణ కావ్యం విశదీకరించాడాయన. జగదానంద కారకుడు, శరణాగతవత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్య చరిత్రను, శ్రీరామనామ మాధుర్యాన్ని మనకందించిన కవికోకిల ఆదికవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు రుణపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన, ఆర్ద్రత కలిగించే వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహా కావ్యాన్ని మనకందించాడు వాల్మీకి మహర్షి. రామాయణంలో అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలైన శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్రధర్మం, మిత్రధర్మం, పతివ్రతా ధర్మాలతోపాటు ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్పరిపాలన, ఉపాసన రహస్యాలు, సంభాషణా చతురత, జీవిత విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏది లేదు.
ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు రామాయణ కావ్యం చదివి, చక్కని గుణవంతులైతే వాల్మీకి ఋణం తీర్చుకున్నట్టే.
– డి.వి.ఆర్.