breaking news
Srimad Ramayana
-
ఆదికవికి అనేక ప్రణతులు
భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం శ్రీమద్రామాయణం. మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాల్లో చెప్పిన అంశాలనే సామాన్య మానవులకు కూడా అర్ధమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకుని వాల్మీకి రామాయణాన్ని వ్రాశాడు. రామాయణాన్ని పరమ పవిత్ర భక్తి వేదంగా పఠిస్తూ పారాయణ చేసేవారు కొందరైతే, మహోత్కృష్ట్ట కావ్యంగా చదువుతూ ఆనందించేవారు కొందరు, మరికొందరు అందులోని కౌశల్యానికి ముగ్ధులైతే, ఇంకొందరు అందులోని మానవీయ విలువలను గ్రహించేవారు. రామాయణం భారతీయుల ఆత్మ... అయితే, యావత్ మానవజాతికి చుక్కాని వంటిదని చెప్పొచ్చు. నిత్యజీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మానవ జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అణగారిన కులాలలో పుట్టినా విలువలతో.. పవిత్రంగా జీవన పయనం సాగించే వారిని చేయి పట్టుకుని నడిపించక మానడు. అంటే ఆ దైవానికి మన గుణగణాలు ప్రధానం కాని కుల మతాలు ప్రమాణం కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి.రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మనవాళికి మార్గదర్శనం చేసే సుభాషితాలెన్నో చెప్పాడు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మమాలను ధర్మసూత్రాలను తాను విరచించిన రామాయణ కావ్యం విశదీకరించాడాయన. జగదానంద కారకుడు, శరణాగతవత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్య చరిత్రను, శ్రీరామనామ మాధుర్యాన్ని మనకందించిన కవికోకిల ఆదికవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు రుణపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన, ఆర్ద్రత కలిగించే వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహా కావ్యాన్ని మనకందించాడు వాల్మీకి మహర్షి. రామాయణంలో అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలైన శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్రధర్మం, మిత్రధర్మం, పతివ్రతా ధర్మాలతోపాటు ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్పరిపాలన, ఉపాసన రహస్యాలు, సంభాషణా చతురత, జీవిత విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏది లేదు.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు రామాయణ కావ్యం చదివి, చక్కని గుణవంతులైతే వాల్మీకి ఋణం తీర్చుకున్నట్టే.– డి.వి.ఆర్. -
రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు
కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్ ధీర్. శ్రీమద్ రామాయణ్ సీరియల్లో ఇతడు రావణుడిగా ఆకట్టుకుంటున్నాడు. కేవలం పేపర్‌పై ఉన్న డైలాగులు బట్టీపట్టి చెప్పడం లేదు. ఆ పాత్రను అర్థం చేసుకున్నాడు. రావణుడిని లోతుగా చదివి అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు.కుడికాలిపై టాటూశివభక్తుడిగా, రావణుడిగా అలరిస్తున్న నికితిన్ తాజాగా తన కుడికాలిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఎన్నో అనుభవాలకు నిలువుటద్దమే జీవితం. మనకు నిజమైన సంపద శరీరమే! పురాతన కాలం నుంచి సనాతన ప్రజలు పచ్చబొట్లను నమ్మేవారు. మనం చనిపోయాక కూడా అవి మనతోనే ఉన్నాయంటారు. టాటూ అనేది చెరగని ముద్రవంటిది.9 నెలలుగా..రావణుడి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మహాదేవుడికి కృతజ్ఞతలు. 9 నెలలుగా ఈ పాత్రలో జీవిస్తూ తనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తనలాంటి(రావణుడి వంటి) రాజు మరొకరు ఉండరని తనకూ తెలుసు. తనలాంటి రాక్షసుడు ఇంకెవరూ లేరని కూడా తెలుసు. తనలాంటి నిష్ట బ్రాహ్మణుడు కూడా ఎవరూ ఉండరని ఎరుక.నా లైఫ్‌లోకి వచ్చినందుకు..తను వీణ వాయిస్తే ఆ సంగీతం వినేందుకు దేవతలు దిగి వస్తారు. ఆయన చంద్రహాస ఖడ్గాన్ని పట్టుకున్నప్పుడు అదే దేవతలు భయంతో దాక్కుంటారు. అలాంటి నువ్వు నా జీవితంలోకి చ్చినందుకు థ్యాంక్స్ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. వీణ, చంద్రహాస ఖడ్గాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. View this post on Instagram A post shared by निकितिन धीर (@nikitindheer) -
బుల్లితెరపై శ్రీమద్ రామాయణం.. మిస్ట్ కాల్‌తో బహుమతి గెలవండి!
సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే " శ్రీ మధ్ రామాయణం". తండ్రి మాట జవదాటని కొడుకుగా.. అన్నగా.. ఏకపత్నీవ్రతుడిగా.. స్నేహితుడిగా.. ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా.. అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరామగాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదని చెబుతుంటారు. రామాయణ ప్రియుల కోసం టీవీ సీరియల్ వచ్చేస్తోంది. ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో.. శ్రీ రాముని అవతార విశిష్టత , జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం నుంచి రామాయణంలోని అన్ని ఘట్టాలను కనులకు కట్టినట్లుగా చూపించనున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో చిత్రీకరించి శ్రీ రామ గాథను బుల్లితెర అభిమాన ప్రేక్షకులందరినీ అలరించేందుకు వచ్చేస్తోంది.శ్రీ మహర్షి వాల్మీకి రచించిన రామాయణాన్ని 'శ్రీమద్ రామాయణంగా' సూపర్ గ్రాఫిక్ టెక్నాలజీతో, అనుభవజ్ఞులైన నటీనటులతో, ఆకట్టుకునే డైలాగ్స్‌తో రూపొందించారు. ఈనెల 27 నుంచి బుల్లితెర ప్రియులను ఈ సీరియల్ అలరించనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానుంది.ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా "జెమినిలో కాసుల వర్షం” అనే కాంటెస్ట్ నిర్వహిస్తోంది. మే 27 నుండి జూన్ 1 వరకు ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు ప్రేక్షకులు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలను తెలియజేసి బహుమతులను పొందే అవకాశం కల్పించింది. ప్రతి రోజు 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేయనున్నారు. -
ప్రశ్నోత్తరాలుగా... రామాయణ మహాకావ్యం
పుస్తకం శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని అనేకమంది రుషులు, కవులు, పండితులు, భాషావేత్తలు అనేక కోణాలలో పరిశీలించి, పరిశోధించి, అందులోని అమృతోపమానమైన విషయాలను వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో పదిమందికీ పంచుతున్నారు. అయితే ఈ ఉరకలు పరుగుల జీవితంలో అంతంత విస్తారమైన గ్రంథాలను చదివి, ఆస్వాదించే ఓపిక, తీరిక అందరికీ ఉండడం లేదు. అలాకాకుండా రామాయణ కథావస్తువును కూడా సులువుగా, సరళంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందించాలనే తాపత్రయంతో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ నండూరు గోవిందరావు రామాయణాన్నంతటినీ ప్రశ్నోత్తరాల రూపంలో అందిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ‘శ్రీ మద్రామాయణము ప్రశ్నోతర మాలిక’ను రచించారు. ఇందులో రామాయణంలోని బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు విషయాన్నంతటినీ ప్రశ్నలు- సమాధానాలుగా అందించారు. ఆయా కాండలలోని విషయాల ఆధారంగా ఉత్తరకాండలో అత్యధికంగా 507 ప్రశ్నోత్తరాలను, సుందరకాండలో అత్యల్పంగా 181 ప్రశ్నోత్తరాలను పొందుపరిచారు. వివరణ అవసరమైన వాటికి విపులంగానూ, లేనిచోట క్లుప్తంగానూ సమాధానాలిచ్చారు. ప్రశ్నలో కూడా ఎంతో విషయాన్ని, వివరణను ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈ ఆచార్యులవారు గతంలో మహాభారతాన్ని కూడా ఇదేవిధంగా ప్రశ్నోత్తర మాలికగా అందజేశారు. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, అందుకు తగిన అధ్యయన శక్తి, వాటికి భక్తిశ్రద్ధలను జతచేస్తే చాలు... ఎంతటి నిగూఢ విషయాలనైనా సులువుగా తెలియచేయవచ్చునని నిరూపించారు. మొత్తం మీద రామాయణమనే కొండను అద్దంలో చూపించే ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఈ ప్సుతకం అవశ్య పఠనీయం. శ్రీమద్రామాయణము, పుటలు: 320; వెల రూ. 200, ప్రతులకు: డాక్టర్ నండూరు గోవిందరావు, 303, పార్క్‌వ్యూ రెసిడెన్సీ, బతుకమ్మకుంట, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్- 500 013; సెల్: 9849801490; తెలుగు బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్; విశాల్ బుక్‌షాప్, నల్లకుంట, హైదరాబాద్. - డి.వి.ఆర్.