
ఎంతటి చేయితిరిగిన చిత్రకారుడైనా ఒకసారి ఒకే కుంచెను చేత్తో పట్టుకుని బొమ్మలు చిత్రించగలడు. అతి అరుదుగా కొందరు రెండు చేతులతోనూ చెరో కుంచె పట్టుకుని బొమ్మలు గీయడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఈ బెలారష్యన్ కళాకారుడు మాత్రం రెండు చేతులతోనూ పదికుంచెలు పట్టుకుని, వాటితో ఏకకాలంలో ఎడాపెడా కళ్లుచెదిరే బొమ్మలు చిత్రిస్తూ, చూసేవాళ్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు.
ఈ కళాకారుడి పేరు సర్జీ ఫీలింగర్. మొదట్లో అందరిలాగానే పద్ధతిగా ఒకసారి ఒక కుంచె పట్టుకునే బొమ్మలు వేసేవాడు. ఇలా బొమ్మలు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో కుంచెను మార్చాల్సి వచ్చేది. బొమ్మ గీసే ప్రక్రియ ఆలస్యమయ్యేది. ఇదంతా చిరాకనిపించడంతో కాస్త వెరైటీగా ప్రయత్నిద్దామనుకున్నాడు. రెండు చేతుల వేళ్లకూ పది కుంచెలను తగిలించుకుని, వాటిని రంగుల్లో ముంచి ఏకకాలంలో పది కుంచెలతోనూ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు.
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నట్లుగా సర్జీ బొమ్మలు అద్భుతంగా రావడం మొదలైంది. అతడు బొమ్మలు గీసే ప్రక్రియ మాత్రమే కాదు, అతడి బొమ్మలు కూడా సందర్శకులను ఆకట్టుకోవడంతో అనతి కాలంలోనే సెలబ్రిటీ పెయింటర్‌గా మారాడు. గడచిన రెండేళ్లలో సర్జీ తన బొమ్మలతో జర్మనీ, పోలండ్, ఇటలీల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ ప్రదర్శనల్లో అతడి పెయింటింగ్స్ కళ్లుచెదిరే ధరలకు అమ్ముడయ్యాయి.