మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'.. | Ancient Rome In One Of The Most Hunted Structures Mistery Story | Sakshi
Sakshi News home page

Mistery.. 'ఏన్షియంట్‌ రేమ్‌ ఇన్‌'! అత్యంత హంటెడ్‌ నిర్మాణాల్లో ఒక్కటి..!

May 12 2024 3:03 PM | Updated on May 12 2024 3:03 PM

మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..

మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..

అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్‌షర్‌లోని వాటన్‌–అండర్‌–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్‌ హంఫ్రీస్‌’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్‌ అండ్‌ హోటల్‌ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్‌.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్‌ అండ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.

ఒక రాత్రి జాన్‌ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్‌ హంఫ్రీస్‌తో పాటు జాన్‌ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్‌లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.

దాంతో జాన్‌.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్‌ రేమ్‌ ఇన్‌ హౌస్‌’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్‌ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్‌. దాంతో జాన్‌.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.

అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్‌.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.

ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్‌. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్‌లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.

ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్‌ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్‌. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్‌ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్‌ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.

ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్‌ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement