అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్‌ యూనివర్స్‌ పోటీ.. | All About Miss Universe Controversy As Contestants Walk Out | Sakshi
Sakshi News home page

అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్‌ యూనివర్స్‌ పోటీ..

Nov 6 2025 4:09 PM | Updated on Nov 6 2025 5:07 PM

All About Miss Universe Controversy As Contestants Walk Out

ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌ పోటీలు వివాదంలో చిక్కుకున్నాయి. సాక్షాత్తు ఆతిథ్య దేశ అధికారే ఈ వివాదానికి కారకుడు కావడం దురుదృష్టకరం. ఈ ఘటనతో ఒక్కసారిగా అందాల భామలు..తాము కేవలం అందానికే కాదు, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని యావత్తు ప్రపంచానికి చూపించారు. తామంతా ఒక్కటేనని..ఒక్కరికి జరిగిన అవమానాన్ని ఎదుర్కొనేందుకు సాటి అందాల పోటీదారులంతా ముందుకు వచ్చి మద్దతు పలకడం..హర్షించదగ్గ విషయం. పైగా మమ్మల్ని చులకనగా చూస్తే ఊరుకోం అని తమ చేతలతో చెప్పకనే చెప్పారు ఈ సుందరీమణులు.

అసలేం జరిగిందంటే..మిస్‌ మెక్సికో ఫాతిమా భాష్‌ను మిస్‌ యూనివర్స్‌ థాయిలాండ్‌ డైరెక్టర్‌ నవత్‌ ఇట్సారగ్రిసిల్‌ (60) బహిరంగా అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందాల పోటీకి ఆతిథ్యమిస్తున్న థాయిలాండ్‌ దేశ అందాల పోటీల అధికానూ ఇలా అనడ సర్వత్ర చర్చనీయాంశమైంది.  వారి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అధికారిక ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో జరిగింది. 

ఇట్సారగ్రిసిల్‌ థాయిలాండ్‌ గురించి ప్రమోషనల్‌ కంటెంట్‌ను పోస్ట్‌ చేయనందుకు మిస్‌ మెక్సికో బాష్‌ను విమర్శించాడు. ఇతర పోటీదారుల ముందు ఆమెను "డమ్మీ" అని అవమానించాడు. వారి మధ్య సంభాషణ దాదాపు నాలుగు నిమిషాలు కొనసాగింది. మెక్సికో మీరు ఎక్కడ ఉన్నారు, థాయిలాంగ్‌కి మద్దతు ఇవ్వడం లేదు, పైగా మీరు మిస్‌ యూనివర్స్‌ టీమ్‌ మాట కూడా ఎందుకు వినడం లేదని గట్టిగా నిలదీశాడు ఇట్సారగ్రిసిల్‌. 

తాను అందరితో మాట్లాడుతున్నానని, మీకేంటి సమస్య అని మిస్‌ మెక్సికో భాష్‌పై ఫైర్‌ అయ్యాడు. అందుకామె తనని మహిళగా గౌరవించడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దాంతో కోపంతో ఊగిపోయిన డైరక్టర్‌ ఇట్సారగ్రిసిల్‌ ఆమెను బయటకు పంపించమని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాడు. ఈ అనూహ్య ఘటనతో మిగతా పోటీదారులంతా మిస్‌ మెక్సికో బాష్‌కు సంఘీభావం తెలుపుతూ ఆమె తోపాటు బయటకొచ్చేసారు.

మరికొందరు ఇట్సారగ్రిసిల్‌పై అరుస్తూ..నిరసన తెలిపారు. దీంతో ఇట్సారగ్రిసిల్‌ మెక్సికోకు మద్దతు ఇచ్చేవారిని అనర్హులుగా ప్రకటిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పైగా ఎవరైనా పోటీని కొనసాగించాలనుకుంటే కూర్చోండి అని ఆర్డర్‌ జారీచేయడమే కాదు, నువ్వు బయటకు వెళ్లినంత మాత్రాన ఈ పోటీ ఆగదు, మిగిలిన అమ్మాయిలతో ఈ పోటీ నిరాటంకంగా కొనసాగుతుంది అని దురుసుగా చెప్పాడు.  

 

 

ఈ వ్యాఖ్యలతో మరికొంతమంది పోటీదారులు ఈవెంట్‌ నుంచి నిష్క్రమించాడరు కూడా. అంతేగాదు పలువురు సుందరీమణులు..ఇది మహిళల హక్కుల గురించి అని..అందుకు అస్సలు ఇలా వ్యవహరించాల్సిన పనిలేదు అంటూ ఇట్సారగ్రిసిల్‌పై మండిపడ్డారు . అయినా ఒక అమ్మాయిని ఇంత దారుణంగా అనడం, ఆమె గౌరవాన్ని కించపరచడమే అని తిట్టిపోస్టూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌(ఎంయూఓ) సైతం స్పందించింది. ఈ అందాల పోటీ ప్రతిష్ట అతని ప్రయేయం కారణం తగ్గుతోందని ఫైర్‌ అయ్యింది. 

అయినా తాము మహిళల గౌరవం, విలువలను ఉలంఘించడాన్ని అనుమతించం. అతను హోస్ట్‌గా ఎలా వ్యవహరించాలో మర్చిపోవడం బాధకరం అంటూ చివాట్లుపెట్టింది. అతని ప్రవర్తనా తీరుపై చట్టపరమైన చర్యల తీసుకుంటానని వెల్లడించింది. ఇది చాలమంది మహిళల కలల పోటీ దాన్ని నిరూపయోగంగా మారనివ్వం అని స్పష్టం చేసింది. దాంతో ఇట్సారగ్రిసిల్‌ దెబ్బకు తను చేసినదానికి క్షమాపణలు  చెప్పడమే గాక, చాలా ఒత్తికి గురయ్యి అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. 

అంతేగాదు ఎవరినైనా చెడుగా, అసౌకర్యం కలిగించేలా మాట్లాడినట్లు భావిస్తే గనుక తనని క్షమించండి అని అభ్యర్థించాడు. అలాగే ప్రత్యేకంగా హాజరైనా 75 మంది అమ్మాయిలను కూడా క్షమాపణలు కోరుతున్నాను అని వేడుకున్నాడు. దీనిపై బాధిత మిస్‌ మెక్సికో ఫాతిమా బాష్‌ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ..తన దేశానికి ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. "నా గొంతును వినిపించడానికి భయపడను. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా..?. అలంకరణ చేసుకోవడానికి, స్టైలింగ్‌ చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి బొమ్మను కాదు. 

తమ లక్ష్యం కోసం పోరాడే అమ్మాయిల గొంతుకగా ఉండటానికి, నాదేశానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానను. అది చెప్పడానికే ఇక్కడకు వచ్చానంటూ భావోద్వేగానికి గురైంది బాష్‌. కాగా, ఆ తర్వాత పోటీ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగింది.  బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అందాల సుందరీ మణిలు పాల్గొన్నారు. అలాగే విజేతకు నవంబర్ 21న కిరీటం అందజేయనున్నారు. 

 

(చదవండి: బాడీషేమింగ్‌ చేస్తే తక్షణ శిక్ష తప్పదు!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement