
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం అట్టహాసం
గచ్చిబౌలి స్టేడియంలో సుందరీమణుల వైభవం
సంస్కృతి, సౌందర్యం మేళవింపుగా ఉత్సవం
హైదరాబాద్: దివిలో తారకలు భువిపైకి దిగి వచ్చాయా? సౌందర్య లోకం అవనిపైకి నడిచి వచ్చిందా? అనే తీరుగా ప్రపంచ సుందరీమణులు తళుక్కున మెరిశారు. తమ అందచందాలతో, చందన మందగమనంతో మురిశారు. భాగ్యనగర ఖ్యాతి మరోసారి విశ్వవ్యాప్తమైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాలకు చెందిన జాతీయ పతాకాలు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో అట్టహాసంగా ఆవిష్కృతమయ్యాయి.
సంస్కృతి, సౌందర్యం మేళవింపుగా ప్రపంచ సుందరి– 2025 ప్రారంభ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, సీఎస్ రామకృష్ణారావు, నగర మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
