సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆకివీడు మండలం చినమిల్లిపాడులో సర్పంచ్ పదవికి రూ.5 లక్షల బహిరంగ వేలానికి కూటమి ప్రతినిధులు దిగారు. బుధవారం గ్రామంలోని చర్చి ప్రాంతంలో కూటమి నాయకులు బహిరంగ సమావేశం నిర్వహించారు. కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తాను గ్రామాభివృద్ధికి రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో పాటు వేలంలో ఎవరైనా ముందుకు రావచ్చని పిలుపునిచ్చారు. గ్రామంలో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ బలపర్చిన వ్యక్తి కూడా పోటీలో ఉండగా.. బహిరంగ వేలం ద్వారా రూ.5 లక్షలు సమావేశ టేబుల్‌పై ఉంచడంతో గ్రామస్తులు, నాయకులు అవాక్కయ్యారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు సొమ్ములను టేబుల్‌పై ఉంచడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ వేలం నిర్వహించడంతో పాటు సవాల్ చేయడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


