పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణులు రెండో రోజు బుధవారం కూడా పరీక్షలు నిర్వహించారు. నిపుణులు హరీంద్రప్రకాశ్, శ్రీహరి టి.నాయర్, అమిత్, జలవనరుల శాఖ ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈలు నిర్మల, శ్రీకాంత్, విజయ్, మల్లికార్జున, పటేల్ ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ఎంఈఐఎల్ పోలవరం ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్ కుమార్, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లో పరీక్షలు చేశారు. ఇప్పటికే గట్టిపడిన ప్రాంతంలో మట్టిని జేసీబీతో తొలగించి పరీక్షలు చేశారు.
చింతలపూడి: ఎస్సీ కార్పొరేషన్ ఒక మినీ బ్యాంక్ లాంటిదని, పాత లబ్ధిదారులు తీసుకున్న రుణాలు, షాపుల అద్దెలను సకాలంలో తిరిగి చెల్లిస్తేనే కొత్త వారికి ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంటుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.ముక్కంటి అన్నారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన దుకాణాల లబ్ధిదారులతో సమావేశమయ్యా రు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్ షా పుల అద్దెలతో పాటు రుణాలు పొందిన వారి నుంచి బకాయిల వసూలు ప్రక్రియను ముమ్మరం చేశామన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన యువతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఇజ్రాయిల్‌లో ఉద్యోగావకాశాలు కల్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): క్యూఆర్ కోడ్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఫొటోఫ్రేమ్ చేయించి ప్రతి స్కూల్లోనూ ప్రదర్శించి దానిని తిరిగి అప్‌లోడ్ చేయమని వెబ్‌సైట్ ఇచ్చి ప్రధానోపాధ్యాయులపై బోధనేతర భారాన్ని మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. క్యూఆర్ కోడ్లు లేదా స్కానర్లు ఏదైనా సరే ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఉపాధ్యాయులకు ఈ విధమైన బోధనేతర పనులను అప్పగించడం సరైన విధానం కాదన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి, డీవైఈఓ, ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తేవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి. నారాయణ దాసు, తాళ్లూరి రామారావు పేర్కొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానంలో కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా బుధవారం మహాన్యాస పూర్వక పంచామృత రుద్రాభిషేకాన్ని, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు.
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నిధి ఆప్‌కే నికట్–డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎంకే వెంకటరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం గునుపూడిలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో, ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు పవర్‌పేట పైడేటివారివీధిలోని ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.


