చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవులకు సంబంధించిన రెండు బ్యాలెట్ పేపర్లను తప్పనిసరిగా బ్యాలెట్ బాక్సులలో వేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం చింతలపూడిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నగర పంచాయతీ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఓటర్లు చైర్‌పర్సన్, కౌన్సిలర్ పదవులకు విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను తప్పక పాటించాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి, సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చే వరకూ పూర్తి బాధ్యత పోలింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
పక్కాగా పంచాయతీ ఎన్నికలు
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రారంభిస్తారన్నారు. ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ: పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని కలెక్టర్ అన్నారు. అనంతరం గ్రా మంలోని జెడ్పీ హైస్కూల్‌లో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, తహసీల్దార్ చల్లన్న దొర, ఎంపీడీఓ కామేశ్వరి, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.


