చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిలిచిన పేదగర్ల సునీత చింతలపూడి పట్టణ సమగ్ర అభివృద్ధే తన ధ్యేయమని అంటున్నారు. అధికార పార్టీకి ఎదురొడ్డి ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమైన ఆమె, పట్టణ అభివద్ధిపై తన విజన్‌ను, ఎన్నికల వ్యూహాలను బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
? చైర్‌పర్సన్‌గా గెలిస్తే చింతలపూడికి ఏమి చేయనున్నారు
చింతలపూడి పట్టణంలో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత. ముఖ్యంగా పట్టణంలోని ప్రతి వార్డులో నాణ్యమైన సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల కోసం పక్కా డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాను. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు, రాత్రివేళల్లో పట్టణమంతా వెలుగులు నింపేలా వీధి దీపాల వ్యవస్థను పటిష్టం చేసి ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దుతాను.
? రాజకీయాల్లోకి రావడానికి కారణం..మీ లక్ష్యం ఏమిటి
ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నా భర్త అబ్రహం కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవడమే నా లక్ష్యం. నన్ను నమ్మి చైర్‌పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు ఆశీస్సులతో, పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తాను.
? ఎన్నికల్లో మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి
పట్టణంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన, ఆదరణ లభించింది. అధికార పార్టీ ఒత్తిళ్లను, ప్రలోభాలను తట్టుకుని ప్రజల పక్షాన నిలబడ్డాను. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అభివృద్ధికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆడబిడ్డగా నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే నా గెలుపు ఖాయమనే పూర్తి నమ్మకం ఉంది.
? పోలింగ్ నేపథ్యంలో ఓటర్లకు మీరిచ్చే సందేశం
పట్టణ ఓటర్లందరికీ నా వినమ్ర విన్నపం ఒక్కటే. చింతలపూడి పట్టణ భవిష్యత్తును, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. గురువారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను, మా కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయకుండా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ సేవకురాలిగా పనిచేస్తానని మాట ఇస్తున్నాను.
చింతలపూడి సమగ్ర అభివృద్ధే లక్ష్యం
నగర పంచాయతీలో సమస్యల పరిష్కారానికి కృషి
వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పేదగర్ల సునీత


