ముసునూరు: గత వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన, నీతి నిబద్ధతకు ఆకర్షితులై పార్టీలో చేరిన ప్రతిఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పట్టుదలగా, నిరంతరం శ్రమించాలని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ముసునూరులో టీడీపీ ఆవిర్భావం నుంచి బలమైన వర్గంగా ఉన్న 20 కుటుంబాలకు చెందిన టీడీపీ మండల, గ్రామ నేతలు, కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. మండల టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి పాకనాటి సీతారామ్, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు పాకనాటి ఆంజనేయులు, సీనియర్ నేత తలకొండ సాంబశివరావు (ఆటో సాంబయ్య) తదితరులు మాజీ సర్పంచ్ రేగుల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం వై ఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానం పలికారు. ఎంపీటీసీ సభ్యురాలు మేడూరి సునీత రవి, మండల యూత్ అధ్యక్షుడు గూంట్రు రంగారావు, ప్రధాన కార్యదర్శి మానికల గంగాధర్ సీనియర్ నేతలు అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం మండలంలో..
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన రవ్వారిగూడెంకు చెందిన జనసేన పార్టీకి చెందిన 30 కుటుంబాల నాయ కులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరా రు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కురసం పాపారావు, కురసం చిన్నారావు, శ్యాంబాబు, రమణలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన సిద్ధాంతాలు నచ్చక వైఎస్సార్సీపీలోకి చేరినట్లు తెలిపారు. ఈ సందర్బంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పైదా రాజేష్, కోర్సా మహేష్, చంద్రం, శ్రీను, కోర్సా భీమరాజు, దుగ్గిరాజులతో పాటు మొత్తం 30 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, నాయకులు, షేక్ ముత్తుసాహెబ్, పైదా సత్యనారాయణ, కురసం రమణ, బొజ్జయ్య, కొవ్వాసి వెంకటేష్, కొవ్వాసి నాంచారమ్మ, భీమరాజు, యోహాన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


