తాగునీరు.. అందని తీరు | - | Sakshi
Sakshi News home page

తాగునీరు.. అందని తీరు

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

పోలవరం రూరల్‌ : సత్యసాయి మంచినీటి పథకం నుంచి గత పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలం కన్నాపురం అడ్డరోడ్డు నుంచి హుకుంపేట పంప్‌ హౌస్‌కు పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించి, అక్కడ శుద్ధి చేసి గ్రామాలకు అందిస్తారు. అయితే ఇటీవల తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో కన్నాపురం రోడ్డు – హుకుంపేట మధ్య లో కొవ్వాడ కాలువ గట్టుకు భారీ గండి పడి, దిగువన ఉన్న సుమారు 800 మీటర్ల పైప్‌లైన్‌ పూర్తిగా కొట్టుకుపోయింది. ఫలితంగా పోలవరం మండలంతో పాటు సుమారు 10 మండలాల్లోని 200 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.

రూ.1.75 కోట్లతో ప్రతిపాదనలు

కొట్టుకుపోయిన చోట కొత్త పైప్‌లైన్‌ నిర్మాణం కోసం రూ.1.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ గంగరాజు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.

పైప్‌లైన్‌ పగిలిపోయి..

మరోవైపు పాత పోలవరం కడెమ్మ స్లూయిజ్‌ వద్ద కూడా పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ఆ ప్రాంతానికీ నీరు అందడం లేదు. పక్కనే గోదావరి నది ఉన్నప్పటికీ నీటిని తెచ్చుకోవడం కష్టంగా మారిందని, గత్యంతరం లేక వాటర్‌ ప్లాంట్ల నుంచి డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

సత్యసాయి పథకం పైప్‌లైన్లకు మరమ్మతులు

వరుస తుపాన్లతో 800 మీటర్ల మేర ధ్వంసం

10 మండలాల్లో నిలిచిన సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement