జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : ప్రపంచ పొగాకు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని 1, 2 బోర్డులలో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఉత్సాహంగా సమావేశమయ్యారు. కోట్లాది మంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి కష్టాన్ని, గౌరవాన్ని గుర్తించేందుకు 2012 నుంచి ఇంటర్నేషనల్ టొబాకో గ్రోవర్స్ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక డిమాండ్లను వారు ప్రభుత్వాల ముందుంచారు.
కోటా పెంపుదలపై విజ్ఞప్తి
2026–27 సీజన్‌కు సంబంధించి ఎన్‌ఎల్‌ఎస్ కోటాను 28.27 మిలియన్ కిలోల నుంచి, గత ఏడాది ఉన్న 49.70 మిలియన్ కిలోలకు పెంచాలని రైతులు కోరారు. బ్యారన్‌కు కేవలం 2,000 కిలోల కోటాతో రైతులకు కనీస పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ సిగరెట్ల స్మగ్లింగ్ అరికట్టాలి
మార్కెట్లోకి సుమారు 25 శాతం సిగరెట్లు అక్రమంగా స్మగ్లింగ్ ద్వారా వస్తున్నాయని, దీనివల్ల దేశీయ పొగాకుకు డిమాండ్ తీవ్రంగా పడిపోతోందని నాయకులు పేర్కొన్నారు. తాము చట్టబద్ధంగా పంట పండించే రైతులమని, తమ జీవనోపాధిని ప్రభావితం చేసే ప్రతి నిర్ణయంలోనూ రైతులను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.
విధాన నిర్ణయాలలో ప్రాతినిధ్యం కల్పించాలి
ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, ప్రభుత్వాలు గానీ పొగాకుపై నిబంధనలు విధించేటప్పుడు పొగాకు రైతు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించి, వారి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో 1వ బోర్డు నుంచి రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు, ఉపాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, కూచిపూడి రమేష్, ముదునూరి రవివర్మ, పోలిన సుబ్రహ్మణ్యం, కాకర్ల శివరామకృష్ణ, ఎం. కాంతారావు, సీవీ నారాయణ తదితరులతో పాటు వందలాది మంది రైతులు పాల్గొన్నారు. అలాగే 2వ బోర్డు నుంచి రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, ఎస్.వీర్రాజు, టెక్కం పండు, పిన్నమనేని శ్రీనివాసరావు, బిక్కిన వెంకటేశ్వరరావు, ఘంటసాల, పి.వెంకట్రావు తదితర రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పొగాకు రైతుల విజ్ఞప్తి


