అర్నబ్‌ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

అర్నబ్‌ బీభత్సం

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

అర్నబ్‌ తుపాను జిల్లాలో బీభత్సం సృష్టించింది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఈదురుగాలుల ధాటికి పంట నష్టంతో పాటు వందలాది విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగులు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. బుధవారం జిల్లాలో పూర్తిస్థాయిలో జనజీవనం స్తంభించింది. మరోవైపు బుధవారం 1,645.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. ఎడతెరపి లేని వర్షం కొనసాగుతోంది.

● జిల్లాలో స్తంభించిన జనజీవనం

● 17 వేల హెక్టార్లల్లో పంట నష్టం

● 5 మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం

● 1,645.8 మి.మీ. వర్షపాతం నమోదు

● జిల్లాలో విస్తారంగా వర్షాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో అర్నాబ్‌ తుపాను ప్రభావంతో జనజీవనం స్తంభించింది. 28 మండలాల్లోని 185 గ్రామాల్లో 16,796 హెక్టార్లల్లో పంటలు నీటమునిగాయి. భారీ ఈదురుగాలులకు పంటలు పూర్తిగా పాడయ్యాయి. ప్రధానంగా 16,796 హెక్టార్లల్లో వరి, ఇతర ప్రధాన పంటలు, అలాగే 179 హెక్టార్లల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పెదవేగి, ద్వారకాతిరుమల మండలాల్లో ఆయిల్‌పామ్‌, కోకోకు నష్టం చేకూరింది. ఇంకోవైపు ఎన్నడూ లేనివిధంగా భారీ ఈదురుగాలులు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి కొనసాగాయి. ఆగిరిపల్లి, నిడమర్రు, మండవల్లి, కామవరపుకోట, నూజివీడుల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆగిరిపల్లిలో 41.55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. జిల్లాలో 50 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,900 మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి కలెక్టరేట్‌లో తుపాను కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 418 చెట్లు నేలకొరిగాయి. 120 విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. 3 పశువులు, 8 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు.

భారీ వర్షపాతం నమోదు

జిల్లాలో 1,645.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఉంగుటూరులో 107.4 మి.మీటర్లు, ద్వారకాతిరుమలలో 89.8, కై కలూరులో 88.4, మండవల్లిలో 86.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఏలూరు డివిజన్‌లో 843, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 551.4, నూజివీడు డివిజన్‌లో 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిలిచిన విద్యుత్‌ సరఫరా : భారీ వర్షాలకు ఏలూరు నగరంలో, జిల్లాలోని కొన్ని ప్రాంతాలు చింతలపూడి, కై కలూరు, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రధానంగా చింతలపూడి, కై కలూరులో మంగళవారం రాత్రి నుంచి వివిధ గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భారీ ఈదురుగాలులకు భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో 70 శాతం వరి చేలు నేలకొరిగాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పోగొండ, కొవ్వాడ, జల్లేరు రిజర్వాయర్లు, ఎర్ర కాలువల ద్వారా భారీగా వరద నీరు చేరుతుంది.

ఉప్పొంగిన వాగులు : కొయ్యలగూడెం: భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు ఉప్పొంగాయి. మంగళవారం రాత్రి నుంచి బైనేరు వాగు, పడమటి కాలువ, తూర్పు కాలువ, పులి వాగు, ఎర్రకాలువలో భారీ వరద నీరు చేరడంతో ఉప్పొంగుతున్నాయి. ఆయా వాగుల ప్రాంతాల్లో రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది

స్తంభించిన జనజీవనం

జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలకు సెలవులు ప్రకటించారు. అధిక వర్షాల కా రణంగా జిల్లాలోని మేనేజ్‌మెంట్‌ కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. గురువారం కూడా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. పెనుగాలుల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రాకపోకలపై ఆంక్షలు విధించారు.

భీమడోలులో నేలకొరిగిన చెట్టు, విద్యుత్‌ తీగలు

కొయ్యలగూడెం మండలం రాజవరం వద్ద ఎర్రకాలువ ఉధృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement