నామవరం ఎంపీటీసీ పోరులో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

నామవరం ఎంపీటీసీ పోరులో హైడ్రామా

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

టీడీపీ కుట్రలను తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ

చింతలపూడి: మండలంలోని నామవరం ఎంపీటీసీ స్థానం ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది.

ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవాలని అధికార టీడీపీ శ్రేణులు పన్నిన వ్యూహాలను వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పికొట్టారు. ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌ వదంతుల నడుమ చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాణావత్‌ ఉమామహేశ్వరరావు ఎన్నికల బరిలోనే నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువైన మంగళవారం ఉమామహేశ్వరరావుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. పార్టీ బీఫామ్‌ను అధికారులకు అందజేయకుండా కుటుంబ సభ్యుల ద్వారా అడ్డుకోవడంతో పాటు ప్రలోభాలకు గురిచేశారని ఆర్‌ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఒక దశలో ఆయనను కిడ్నాప్‌ చేశారన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎంపీడీఓ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరుపార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ పరిణామాల నడుమ ఉమామహేశ్వరరావు (మహేష్‌) సురక్షిత ప్రాంతం నుంచి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనం సృష్టించింది. టీడీపీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేస్తూ, బీఫామ్‌ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, వారి ఒత్తిళ్లు తట్టుకోలేకనే తలదాచుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గడువులోపు బీ–ఫారమ్‌ అందజేత

పరిస్థితిని గమనించిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు అప్రమత్తమై, గడువు ముగిసేలోపే రిటర్నింగ్‌ అధికారి వై.సుబ్బారావుకు పార్టీ బీ–ఫారమ్‌ను అందజేశారు. దీంతో టీడీపీ ఎత్తుగడలు ఫలించలేదు. తీరా సాయంత్రం 5 గంటల సమయంలో టీడీపీ శ్రేణులు ఉమామహేశ్వరరావును వెంటబెట్టుకుని వచ్చి నామినేషన్‌ ఉపసంహరించుకుంటామని కోరగా, అప్పటికే గడువు ముగిసిందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ఆయన పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఉదయం నుంచి సాగిన ఉత్కంఠ వీడింది.

ప్రజాస్వామ్యం ఖూనీ

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ప్రలోభపెట్టి, సాధ్యం కాకపోతే కిడ్నాప్‌ చేయాలని చూసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ కంభం విజయరాజు డిమాండ్‌ చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో నేరుగా గెలిచే ధైర్యం లేకనే టీడీపీ కుయుక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement