ఏలూరు (టూటౌన్): జిల్లాలో అర్నబ్ తుపాను కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు కలుగకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అర్నబ్ తుపాను తీవ్రత, నష్టాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని, ఎత్తయిన హోర్డింగ్‌లు తొలగించాలని, శిథిల భవనాలు, రేకుల షెడ్లలోని ప్రజలను తరలించాలన్నారు. వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తం చేయాలన్నారు. నదులు, చెరువులు, కాలువలలోనికి ప్రజలు వెళ్లకుండా చూడాలని, వాటికి గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు : ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో 18002331077, 08812–224519 , 94910 41419 ఫోన్ నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయిలలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు 94409 02926, 94409 04037, 94910 30712, విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
ఎస్పీ, జేసీలతో చర్చ
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల మ్యాప్ లను పరిశీలించి, ఏ ఏ ప్రాంతంలో తుపాను తీవ్రత అధికంగా ఉంటుంది, భారీ వర్షాలు కురిసే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ దళాలు సిద్ధం చేయడం, ఎక్కడా ఎటువంటి నష్టాలు సంభవించకుండా తీసుకోవలసిన .ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలపై చర్చించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ తుపాను ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర విపత్తు నివారణ దళం, పోలీస్ సిబ్బందితో సహాయక కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ ఎం. ముక్కంటి పాల్గొన్నారు.


