ధరల స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టి సారించనంత వరకు రైతులు కొనుగోలుదారులు, మధ్యవర్తుల దోపిడీకి గురికాక తప్పదు. ఏటేటా సాగు వ్యయం పెరిగిపోతోంది. ఈమధ్య కాలంలోనే మేతల ధరలు 40 శాతం పెరిగినా, రొయ్యల ధరలు మాత్రం దారుణంగా పడిపోవడం దారుణం. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఆక్వా రైతులకు న్యాయం చేయాలి.
– కాకర్ల వినాయక, ఆక్వా రైతు
గణపవరం: లక్షల రూపాయల పెట్టుబడులతో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు రొయ్య ధరలు అమాంతం పడిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు మేతలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోగా, మరోవైపు ఉన్న ధరలను వ్యాపారులు అడ్డగోలుగా తగ్గించేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఫీడ్ కంపెనీలు విడతలవారీగా మేత ధరలను సుమారు 40 శాతం వరకు పెంచేయడంతో అసలు సాగు చేయాలా వద్దా అన్న సందేహంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
అడ్డగోలుగా కోత.. వారం రోజుల్లోనే భారీగా పతనం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆక్వా రైతులకు వ్యాపారుల దోపిడీ గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. వారం రోజుల క్రితం వరకు 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.285 నుంచి రూ.290 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.240 నుంచి రూ.245కే కొనుగోలు చేస్తున్నారు. అలాగే 50 కౌంట్ రొయ్య ధర రూ.390 నుంచి ఏకంగా రూ.360కి పడిపోయింది. వ్యాపారులు, కంపెనీలు సిండికేట్‌గా మారి ఇష్టారాజ్యంగా ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కాగా, వ్యాధుల బారిన పడిన చెరువులు, మిడిల్ క్రాప్ తీయాల్సిన చెరువుల నుంచి రొయ్యలను పట్టివేయక తప్పని పరిస్థితి ఉండటంతో, వ్యాపారులు చెప్పిన తక్కువ ధరకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు.
రైతుల్లో అర్నబ్ ఆందోళన : ఒకవైపు వ్యాపారుల కోతలు, మరోవైపు అర్నబ్ తుపాను హెచ్చరికలు రొయ్య రైతులను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తుపాను తీవ్రత భారీగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల రొయ్యలను అర్ధాంతరంగా పట్టాల్సి వస్తే, రొయ్యల కంపెనీలు ధరలను మరింతగా తగ్గించి దోచుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతులు
పెరిగిన మేతలు, మందుల ధరలతో తీవ్ర నష్టం
సిండికేట్‌గా మారి వ్యాపారుల దోపిడీ
మరోవైపు అర్నబ్ తుపాను భయం


