సత్తా చాటిన సైబర్‌సెల్‌ పోలీస్‌ | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన సైబర్‌సెల్‌ పోలీస్‌

Oct 7 2026 1:16 AM | Updated on Oct 7 2026 1:16 AM

సత్తా చాటిన సైబర్‌సెల్‌ పోలీస్‌ కారు కనిపించడం లేదని ఫిర్యాదు క్వారీలో రెండు ట్రాక్టర్లు సీజ్‌ మద్ది క్షేత్రానికి రూ.2.57 లక్షల ఆదాయం కారు అదుపు తప్పి బోల్తా

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లాలో సైబర్‌సెల్‌ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్‌ఫోన్ల రికవరీలో తమ సత్తా చాటుకున్నారు. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే సుమారు రూ.50 లక్షల విలువైన 200 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 4,563 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేశామని, వీటి మార్కెట్‌ విలువ సుమారు రూ.11 కోట్ల 40 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. ప్రజలు తమ మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌సెల్‌ సీఐ దాసు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: పట్టణంలోని ఓ ఆసుపత్రి వద్ద పార్కింగ్‌ చేసిన కారు కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్సై రామరావు మంగళవారం తెలిపారు. కాళ్ల మండలం పెదఅమిరం గ్రామానికి చెందిన కటికతల జార్జ్‌ ఈ నెల 3న భీమవరం వచ్చి, వర్మ ఆసుపత్రి వద్ద తన కారును పార్కింగ్‌ చేసి వేరే పనిపై బయటకు వెళ్లారు. తిరిగి 4వ తేదీన వచ్చి చూసేసరికి కారు కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు వెల్లడించారు.

నూజివీడు: మండలంలోని తక్కులూరులోని క్వారీలో అక్రమంగా మైనింగ్‌ నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మైనింగ్‌ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం క్వారీని సందర్శించారు. ఆ సమయంలో క్వారీలో ఉన్న రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఎంతమేరకు అక్రమ మైనింగ్‌ చేశారనే విషయాలను నిర్ధారించుకొని తదుపరి ట్రాక్టర్లకు జరిమానా విధిస్తారని తహసీల్దార్‌ షంషుద్ధీన్‌ పేర్కొన్నారు. ఇక్కడ అక్రమ మైనింగ్‌ జరుగుతుందని పీజీఆర్‌ఎస్‌లో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహించారు.

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని మంగళవారం పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించడంతో పాటు, భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసనలు, నూతన వాహనాలకు పూజలను ఆలయ అర్చకుల ద్వారా జరిపించుకున్నారు. వివిధ సేవల రూపంలో దేవస్థానానికి రూ.2,57,468 ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. సుమారు 2,834 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు వారు వెల్లడించారు.

ఉంగుటూరు: జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద చిన్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న కారు నాచుగుంట వద్దకు వచ్చేసరికి, వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములను చూసి డ్రైవర్‌ కంగారు పడ్డాడు. దీంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువ గట్టు వైపు తిరగబడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement