జ్ఞాపకాలకు ‘మరుపు’ ముప్పు | - | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలకు ‘మరుపు’ ముప్పు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు

నేడు ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం

వయసుతో వచ్చే మతిమరుపును నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల హెచ్చరిక

ద్వారకాతిరుమల: పేరు గుర్తురాకపోవడం, ఇటీవల జరిగిన విషయాలను మరిచిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో పోల్చుకోలేకపోవడం.. వయసు పెరిగేకొద్దీ కనిపించే సాధారణ సంకేతాలు. అయితే ఈ మతిమరుపు తరచుగా పునరావృతమవుతూ, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ‘అల్జీమర్స్‌’ లేదా ఇతర రకాల ‘డిమెన్షియా’ (జ్ఞాపకశక్తి లోపించే వ్యాధి)కి సంకేతం కావచ్చు. అల్జీమర్స్‌ అనేది మెదడు పనితీరును క్రమంగా దెబ్బతీసే తీవ్రమైన వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు ఆలోచనలు, నిర్ణయాలు, సంభాషణలు, తెలిసిన పనులు చేసే సామర్థ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. డిమెన్షియా కేసుల్లో 60 నుండి 70 శాతం వరకు అల్జీమర్స్‌ బాధితులే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్లకు పైగా ప్రజలు డిమెన్షియాతో బాధపడుతుండగా, ఏటా దాదాపు కోటి కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఎప్పుడు అప్రమత్తం కావాలి?

● వృద్ధాప్యంలో అప్పుడప్పుడు వస్తువులు లేదా పేర్లు మరిచిపోవడం సహజమే అయినా, రోజువారీ పనులకు ఆటంకం కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

● ఇటీవల జరిగిన విషయాలను పదేపదే మరిచిపోవడం

● ఒకే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడగడం

● తెలిసిన పనులను సజావుగా చేయలేకపోవడం

● సమయం, ప్రదేశాల విషయంలో గందరగోళానికి గురికావడం

● మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం

● ప్రవర్తన, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు రావడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి. సమయానికి మందులు వేసుకోలేకపోవడం, డబ్బు లావాదేవీల్లో పొరపాట్లు, వంట చేయడం లేదా బయటకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదురైతే శ్రద్ధ వహించాలి. అయితే డిమెన్షియా అనేది కేవలం వృద్ధాప్యం వల్ల తప్పనిసరిగా వచ్చే పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోంది.

యువతకూ అల్జీమర్స్‌ ముప్పు

అల్జీమర్స్‌ కేవలం వయోవృద్ధులకే పరిమితం కాదు. 65 ఏళ్ల లోపు వారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కుటుంబంలో అల్జీమర్స్‌ చరిత్ర ఉండటం, అరుదైన జన్యు మార్పులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, తీవ్రమైన మద్యపానం మరియు తలకు గాయాలు కావడం. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన యువకులు, బిపి పెరిగి మెదడు నరాలు దెబ్బతిన్నవారు జ్ఞాపకశక్తి కోల్పోతున్న సందర్భాలు ఇటీవల పెరుగుతున్నాయి.

45 శాతం ప్రమాదాన్ని అరికట్టవచ్చు

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా డిమెన్షియా ప్రమాదాన్ని 45 శాతం వరకు నివారించవచ్చని లేదా ఆలస్యం చేయవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ తాజా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం, వాయు కాలుష్యం నుంచి జాగ్రత్తపడటం, బిపి, షుగర్‌ నియంత్రణలో ఉంచుకోవడం మరియు సామాజికంగా ఉత్సాహంగా ఉండటం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. జీవితంలోని ప్రతి దశలోనూ మంచి అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో కీలకం.

మెదడు ఆరోగ్యానికి సూత్రాలు:

● క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం.

● మెదడుకు మేత వేసే యాక్టివిటీలు, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం.

● బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవడం.

● వినికిడి లోపం ఉంటే వెంటనే హియరింగ్‌ పరికరాలు వాడటం.

● కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకం

అల్జీమర్స్‌ బాధితులను మతిమరుపు నెపంతో మందలించడం లేదా అవమానించడం చేయకూడదు. వారితో ఎంతో ఓర్పుతో వ్యవహరించాలి. ఇంటిని సురక్షితమైన వాతావరణంగా మార్చి, క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా చూడాలి. బాధితులను చూసుకునే సంరక్షకులు కూడా తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి.

వయసు పెరిగేకొద్దీ వచ్చే ప్రతి మతిమరుపూ అల్జీమర్స్‌ కాదు. అయితే జ్ఞాపకశక్తి తగ్గి రోజువారీ పనులపై ప్రభావం చూపుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. డిమెన్షియాకు సంపూర్ణ నివారణ లేకపోయినప్పటికీ, సరైన వైద్యం, శారీరక శ్రమ, కాగ్నిటివ్‌ స్టిమ్యులేషన్‌ మరియు కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు బాధితుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయి.

– డాక్టర్‌ ఎ. ప్రవీణ్‌ కుమార్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి, ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement