ఆడిట్ కోసం వచ్చి.. పసిడిని అపహరించి..
నగలను మార్చి.. నకిలీవి చేర్చి..
బంగారం.. అమ్మో బంగారం అనేంతగా ధర పెరిగింది.. జీవితకాల గరిష్టాలకు చేరి ఆశ్చర్యపరిచింది.. ధర పెరగడంతో బంగారంపై ఇచ్చే రుణం విలువ కూడా రెట్టింపయ్యింది. ఇదే అదునుగా కొందరు బ్యాంకు అధికారులు మోసాలకు తెరదీశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధి లోని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో వెలుగుచూసిన మోసాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఏఐ సృష్టించిన చిత్రం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ బ్యాంకులో బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచి దాదాపు రూ.10 కోట్లు మోసం చేసిన ఘటన.. మరో ఫైనాన్స్ సంస్థలోఆడిట్ కోసం వచ్చిన వ్యక్తి 2 కిలోల బంగారంతో పరారీ.. ఇంకో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఖాతాదారుడి బంగారం గోల్‌మాల్.. నకిలీ పత్రాలతో వేలం నిర్వహించి ఓ స్థలాన్ని ఖాతాదారుడికి విక్రయించిన సంఘటన మరో ప్రైవేట్ బ్యాంకులో ఇలా.. వరుస మోసాలకు జంగారెడ్డిగూడెం డివిజన్ వేదికైంది. ఆయా కేసుల్లో బ్యాంకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
గోల్డ్‌లోన్ ఖాతాలతో ఏ‘మార్చి’..
జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్‌ఎల్‌లో బంగారాన్ని ఖా తాదారుడికి తెలియకుండా బ్యాంకు మేనేజర్ మరో బ్యాంకులో కుదువపెట్టి రుణం పొందిన ఘటనపై గత ఫిబ్రవరి 21న కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ధనలక్ష్మి 270 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.13 లక్షల రుణం పొందారు. ఈ మేరకు ప్రతినెలా వడ్డి చెల్లించేవారు. బ్యాంకు మేనేజర్ ఉద్దగిరి చైతన్య రాము బంగారం విలువ పెరిగిందని, లోన్ ఎక్కువ వస్తుందని చెప్పి ఆమె నుంచి ఓటీపీలు తెలుసుకున్నాడు. ఆమెకు తెలియకుండా రుణం తీర్చి.. 270 గ్రాముల బంగారాన్ని విడిపించి మరో ఖాతాలో కుదువపెట్టి ఎక్కువ రుణం పొందాడు. రుణం చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆమె తన పేరుపై గోల్డ్‌లోన్ లేదని చెప్పడంతో అవాక్కయ్యింది. మేనేజర్ రాముకు ఫోన్ చేస్తే స్పందించలేదు. అతడు ఉద్యోగం మానేసిన ట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.
ఈ–వేలం.. నకిలీ పత్రాలతో మోసం
నకిలీ పత్రాలతో లేని స్థలానికి ఈ–వేలం నిర్వహించి ఓ ఖాతాదారుడిని మోసగించిన ఘటనపై గత జూలై 8న కేసు నమోదైంది. జంగారెడ్డిగూడెం కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకులో సర్వేనం.455లో 108 గజాల స్థలానికి ఈ–ఆక్షన్ నిర్వహించగా పట్టణానికి చెందిన రాజు జయపాండే రూ.17.66 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం ఈ ఏడాది జనవరి 7న బ్యాంక్ అధికారి యశోద కృష్ణారావు, మేనేజర్ ఐన ఆంజనేయులు ఆ స్థలాన్ని జయపాండే పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. అనంతరం జయపాండే సదరు స్థలం వద్దకు వెళ్లగా ఆ సర్వే నంబర్‌లో 108 గజాల స్థలం లేదని, ఆ స్థలంపై ఎలాంటి బ్యాంకు రుణం లేదని తెలుసుకుని అవాక్కయాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌పై బ్యాంకు అధికారులను నిలదీయగా రేపూమాపూ అంటూ తిప్పించుకుని కోర్టుకు వెళ్లమని చెప్పి చేతు లు దులుపుకున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారి యశోద కృష్ణారావు, మేనేజర్ ఐన ఆంజనేయలు, అసిస్టెంట్ మేనేజర్ కిషోర్, బ్యాంకు అధికారి హరిప్రియ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో గతేడాది సెప్టెంబర్ 9న ఆడిట్ కోసం వచ్చిన ఉద్యోగి వి.ఉమమాహేశ్వరరరావు 4.484 కిలోల బంగారాన్ని అపహరించాడు. దాదాపు నాలుగు నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. బంగారం విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి బంగారాన్ని రికవరీ చేశారు. అయితే రికవరీ చేసిన సొత్తును పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంతో జూన్ వరకు ఫైనాన్స్ కంపెనీ వద్ద బాధితుల ఆందోళనలు కొనసాగాయి.
‘గోల్డ్’మాల్
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ‘బంగారం’ మోసాలు
వరుస కేసుల్లో బ్యాంకర్ల అరెస్ట్
జంగారెడ్డిగూడెం డివిజన్‌లో నాలుగు సంఘటనలు
వెలుగులోకి సరికొత్త మోసాలు
నకిలీ ఆస్తి పత్రాలతో ఈ–వేలం
జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) బ్రాంచ్‌లో గోల్డ్‌లోన్ మోసంపై గత జూన్ 16న కేసు నమోదైంది. 176 ఖాతాల్లోని 6.449 కిలోల తాకట్టు బంగారాన్ని మాయం చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచారు. ఈ కేసులో పోలీసులు బ్యాంక్ అప్రయిజర్ చలపాక రాజు, బ్యాంకు మేనేజర్ కుమారపు భాస్కరరావు, జాయింట్ మేనేజర్ తన్నేరు అజయ్‌బాబు, క్రెడిట్ ఆఫీసర్ జంగల సాయిరాజును అరెస్ట్ చేసి 4.120 కిలోల ఆభరణాలు, రూ.10 లక్షల నగదు మొత్తంగా రూ.5.81 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాకట్టు బంగారాన్ని మార్చి నకిలీవి చేర్చే విషయంలో అప్రయిజర్ మొదలు బ్యాంక్ మేనేజర్ వరకు కుమ్మక్కయ్యారని పోలీసుల విచారణలో తేలింది.


