ఎల్‌నినో లీల.. తప్పిన జలకళ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో లీల.. తప్పిన జలకళ

Sep 14 2026 5:24 AM | Updated on Sep 14 2026 5:24 AM

వర్షాలు కురిస్తేనే జలపాతాల అందాలు

నామమాత్రంగా జలపాతాల్లో నీటి ప్రవాహం

నిరాశతో వెనుదిరుగుతున్న పర్యాటకులు

వెలవెలబోతున్న పశ్చిమ ఏజెన్సీ అందాలు

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ప్రతీఏటా వర్షాకాలం మొదలైతే చాలు, బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన ఉప్పరిల్ల, ముంజులూరు గ్రామ అటవీ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు జలకళతో ఉట్టిపడుతూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటాయి. వీటితోపాటు పోలవరం మండలం కుంకాల సమీపంలోని జలపాతం, పాపికొండల అభయారణ్యంలో ఉన్న జలతారు వాగు జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఎంతో కనువిందు చేస్తుంటాయి.

పర్యాటకులకు నిరాశే

ఈ జలపాతాలను చూసేందుకు విజయవాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు మైళ్ల దూర ప్రయాణం చేసి వచ్చి, జలపాతాలను తిలకించి మంత్రముగ్ధులవుతుంటారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్న ఈ జలపాతాలను చేరుకోవడం కష్టతరమైనప్పటికీ, వాటిని చూసిన అనంతరం ఆ ప్రయాణ శ్రమను పర్యాటకులు మరచిపోయి ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. అయితే, ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించడంలేదు. జలపాతాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశే మిగులుతోంది.

ఎల్‌నినో ప్రభావంతో

ప్రకృతి అందాలు వెలవెల

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవలేదు. అప్పుడప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షాల కారణంగా జలపాతాల్లో నీటి ప్రవాహం నామమాత్రంగానే సాగుతోంది. ఎత్తైన కొండల నుంచి దూకాల్సిన జలపాతాలు కేవలం చిన్నపాటి నీటిధారలుగా మారి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్న పర్యాటకులకు ఈ పరిస్థితి తీవ్ర నిరాశను మిగులుస్తోంది. జలపాతాల హోరులో సేద తీరాలని ఆశపడిన వారు, రాళ్ల మధ్య సన్నగా జారుతున్న నీటి ప్రవాహాన్ని చూసి నిరాశతో వెనుతిరగాల్సి వస్తోంది.

గతంలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు

ప్రతీఏటా వర్షాకాలం ప్రారంభంలో కురిసే వర్షాలకు జూన్‌ నెలాఖరు నుంచే జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. కార్తీక మాసంలోనూ ఈ జలపాతాలను చూసేందుకు ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరంగా గడుపుతుంటారు. అయితే, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావంతో ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు కళావిహీనంగా మారా యి. ఈ ప్రాంతంలోని అనేక పిక్‌నిక్‌ స్పాట్‌లు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల బోసిపోయి కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు కొద్దిపాటి ధారలతోనే జలపాతాలు ప్రవహిస్తున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తున్నా నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. గతంలో ఈ పరిస్థితి ఎన్నడూలేదు. వర్షాలు కురిస్తేనే మళ్లీ జలపాతం అందాలను తిలకించవచ్చు.

– మూలెం రమేష్‌, పులిరామన్నగూడెం, బుట్టాయగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement