జై వనరూపిణీ.. జై విజయకారిణీ | - | Sakshi
Sakshi News home page

జై వనరూపిణీ.. జై విజయకారిణీ

Sep 14 2026 5:24 AM | Updated on Sep 14 2026 5:24 AM

జై వనరూపిణీ.. జై విజయకారిణీ రాట్నాలమ్మ తల్లికి రూ.67,246 ఆదాయం మూలవిరాట్‌ ఫొటోలు తీసి పట్టుబడ్డ భక్తురాలు కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు పెద్దింట్లమ్మా.. పాహిమాం పరిమెళ్లలో చోరీ

బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీవారితో పాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

పెదవేగి: మండలంలోని రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి వివిధ సేవల రూపేణా రూ.67,246 ఆదాయం లభించిందని ఆలయ కమిటీ చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సతీష్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విడుదల సత్యనారాయణ తెలిపారు.

ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి ఆలయంలో శ్రీవారి మూలవిరాట్‌ను ఓ మహిళ ఆదివారం తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన ఘటన వివాదాస్పదమైంది. విశాఖకి చెందిన సదరు మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చింది. ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోయినా.. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి తులసిమాలలతో కలిపి, కవర్‌లో పెట్టుకుని ఉచిత క్యూలైన్‌ ద్వారా లోపలికి వెళ్లింది. దర్శనం అనంతరం సెల్‌ఫోన్‌తో మూలవిరాట్‌ను ఫొటోలు తీసింది. దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆమె సెల్‌ఫోన్‌లోని ఫొటోలను డిలీట్‌ చేయించారు. ఆమె వివరాలు నమోదు చేసుకుని, మందలించి విడిచిపెట్టారు. సదరు మహిళ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అని తెలుస్తోంది.

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని యర్నగూడెం వద్ద హెచ్‌సీసీ ఫ్లై ఓవర్‌ సర్వీసు దిగిన వెంటనే మారుతీ కారు అదుపుతప్పి మినప చేనులోకి దూసుకు వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏలూరుకు చెందిన వారు ముగ్గురూ ఆదివారం పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఉన్నప్పటికీ వాటి మధ్య నుంచి కారు దూసుకువెళ్లి బోల్తా పడింది.

కై కలూరు: అమ్మలగన్న అమ్మ.. కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. పాహిమాం అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. పెద్దింట్లమ్మ దేవస్ధానం వద్ద ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు వివిధ సేవల రూపేణా అమ్మవారికి రూ.22,810 ఆదాయం వచ్చిందని తెలిపారు.

పెంటపాడు: పరిమెళ్ల గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగిన దొంగతనంలో వెండి పూజా సామాన్లు అపహరణకు గురయ్యాయి. గ్రామానికి చెందిన కొలచల అగ్నిహోత్రుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి తలుపులు పగులకొట్టి, లోపలకు ప్రవేశించారు. రెండు వెండి చెంబులు, రెండు పళ్లాలు, పూజకు సంబంధించిన ఒక చిన్న పళ్లెం అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటి ఆవరణను ఊడ్చేందుకు వచ్చేసరికి తలుపులు తెరుచుకుని ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement