కామవరపుకోట: విద్యుత్ సరఫరాలో, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి విద్యుత్ కోతలకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. స్థానిక కొత్తూరు బస్టాండ్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి చెక్‌పోస్ట్ వరకు పాదయాత్రగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. గత కొన్ని రోజులుగా గృహ విద్యుత్ సరఫరా కూడా సరిగా లేకపోవడం వల్ల వృద్ధులు, విద్యార్థులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి పేరుతో దోచిపెట్టడమే పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏవేవో సాకులు చెబుతూ అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తే.. రైతులు, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏనాడు ఇటువంటి దుర్భర పరిస్థితులు లేవని, విద్యుత్ రంగంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర రైతాంగానికి ఐదేళ్లపాటు నాణ్యమైన విద్యుత్ అందించారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధను పరిపాలనపై చూపాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు సాయిన కనకరాజు, గుర్రాల రవి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి భీమిరెడ్డి వెంకన్నబాబు, మనెల్లి మద్ది రామయ్య, నార్ని శివన్నారాయణ, దేవరపల్లి రామ్‌మోహన్‌రావు, పెద్ది రాజు, నెక్కలపూడి బాబీ, తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, మేడంకి పద్మ, సిరిశెట్టి సిద్దిరాజు, మేడంకి విజయరావు, ఎస్కే కరిముల్లా, బొల్లు వెంకట సత్యనారాయణ, నానది సాగర్ కిరణ్, కనుమూరు అంజిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రఘపతిరెడ్డి, మెరుగు బాబురావు, జోడలా వెంకట్, అడమెల్లి అచ్చియ, యానాద్రి పీటర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ చింతలపూడి
కన్వీనర్ కంభం విజయరాజు ధ్వజం


