హోటల్‌ వర్కర్ల మధ్య వివాదమే హత్యకు కారణం | - | Sakshi
Sakshi News home page

హోటల్‌ వర్కర్ల మధ్య వివాదమే హత్యకు కారణం

Sep 14 2026 5:24 AM | Updated on Sep 14 2026 5:24 AM

యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

హత్యకు పాల్పడిన నిందితుడితో పాటు హోటల్‌ యజమాని అరెస్ట్‌

భీమడోలు: పాత గొడవలతో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ద్వారకాతిరుమల మండలంలోని లక్ష్మీనగర్‌ పరిధిలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన ఏలూరి శివశంకర్‌ (వర్కర్‌), నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన హోటల్‌ యాజమాని భలే విఘ్నేశ్వరరావులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో సీఐ వి.కృష్ణతో కలిసి ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జాతీయ రహదారి పక్కన గల లక్ష్మీనగర్‌ వద్ద భలే విఘ్నేశ్వరరావుకు చెందిన ఛాయ్‌ బిస్కెట్‌ ఫుడ్‌ కోర్టులో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరుకు చెందిన కోనేటి గంగాధరరావు, ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన ఏలూరి శివశంకర్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ హోటల్‌లో పని విషయంలో తరచూ గొడవలు జరిగి, పలుమార్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కక్షలు పెంచుకున్నారు. ఈ తరుణంలో నిందితుడు ఏలూరి శివశంకర్‌ ఈ విషయాన్ని హోటల్‌ యాజమాని భలే విఘ్నేశ్వరరావుకు చెప్పాడు. గంగాధర్‌ను ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో శివశంకర్‌ను హోటల్‌ యాజమాని రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ రాత్రి యాజమాని ప్రోద్బలంతో శివశంకర్‌ తన వద్ద ఉన్న చాకుతో గంగాధర్‌ను పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గంగాధర్‌కు సరైన వైద్యం అందించకుండా హోటల్‌ యాజమాని నిర్లక్ష్యం వహించడంతో, బాధితుడు ఈనెల 10వ తేదీన హోటల్‌ రెస్ట్‌ రూమ్‌లోనే మృతి చెందాడు. గుణ్ణంపల్లి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏలూరి శివశంకర్‌తో పాటు అతనికి సహకరించిన భలే విఘ్నేశ్వరరావును భీమడోలు సీఐ వి.కృష్ణ పట్టుకుని అరెస్ట్‌ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారి, సీఐ వి.కృష్ణ, ఎస్సై టి. సుధీర్‌ పోలీస్‌ సిబ్బంది జి. ధర్మరాజు, వీజే ప్రకాష్‌బాబులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement